One Died Due To Landslide In Vijayawada: విజయవాడలో (Vijayawada) మరోసారి కొండ చరియలు విరిగిపడ్డాయి. మాచవరం వద్ద కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అటు, కాకినాడ జిల్లాలో (Kakinada District) భారీ వర్షాలకు వచ్చిన వరదలో ముగ్గురు యువకులు చిక్కుకున్నారు. పిఠాపురం మండలం రాపర్తి వద్ద గొర్రికండి కాలువ వరద ప్రవాహాన్ని చూసేందుకు గ్రామానికి చెందిన యువకులు ఎస్.శివ, దుర్గాప్రసాద్, బి.శివ వెళ్లారు. ఈ క్రమంలో కాలువకు గండి పడడంతో తిరిగి వచ్చే దారి తెలియలేదు. దీంతో పక్కనే ఉన్న పొలాల్లోంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేయగా.. వరదలో చిక్కుకున్నారు. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, అధికారులు.. స్థానికుల సహకారంతో వరదలో చిక్కుకున్న ముగ్గురిని రక్షించారు. 


ఏలేరు కాల్వకు వరద


మరోవైపు, ఎగువన కురుస్తోన్న వర్షాలతో కాకినాడ జిల్లా ఏలేరు కాల్వకు భారీగా వరద కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 46 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. 27 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీని ప్రభావంతో జిల్లాలోని 10 మండలాల పరిధిలో 86 గ్రామాల్లో కాలనీలను వరద చుట్టుముట్టింది. కిర్లంపూడి మండలం రాజుపాలెం, ఎస్ తిమ్మాపురం, గోపాలపట్నం, సుదరాయనపాలెం గ్రామాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. ఎస్ తిమ్మాపురం, రాజుపాలెం గ్రామాల వద్ద కాల్వకు గండి పడడంతో వరద గ్రామాలను ముంచెత్తింది. ఇళ్లు, పంట పొలాల్లోకి నీరు చేరి గ్రామాల నుంచి బయటకు రాలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్రాక్టర్‌పై పర్యటించి బాధితులతో మాట్లాడారు. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.


Also Read: Crime News: ఏపీలో దారుణాలు - సెల్ ఫోన్ దొంగిలించారన్న అనుమానంతో దంపతులపై కొడవలితో దాడి, మరో చోట ప్రాణం మీదకు తెచ్చిన పందెం