కూతురి కోసం ప్రియుడిని హత్య చేసింది. ఇదేదో సినిమా స్టోరీ కాదు. నెల్లూరులో జరిగిన క్రైమ్ కథా చిత్రం. ఓ హత్య కేసును విచారించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో ఆరు నెలల కిందట ఈ హత్య జరిగింది. మనుబోలు మండలం చెరుకుమూడికి చెందిన కూరపాటి వెంకయ్య వయసు 74 సంవత్సరాలు. కసుమూరు కొండపై అతను దర్గా నిర్వహిస్తున్నాడు. అక్కడే నివాసం ఉండేవాడు. దర్గాకు వచ్చే భక్తుల వద్ద డబ్బులు తీసుకుని, దర్గా నిర్వహణ చూసుకునేవాడు.
అలా ఆధ్యాత్మికతలో ఆ వెంకయ్య ఉండి ఉంటే ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు హ్యాపీగా ఉండేవాళ్లు. కానీ ఆధ్యాత్మికత పేరుతో ఆ వ్యక్తి వక్రమార్గం పట్టాడు. దర్గాకు సమీపంలో ఉండే ఓ మహిళతో వెంకయ్య సన్నిహితంగా ఉండేవాడు. భర్తలేని ఆ మహిళ జీవనాధారం కోసం వెంకయ్యపై ఆధారపడింది. ఆమె ఇంట్లోనే నివశించేవాడు వెంకయ్య. ఆ కుటుంబం బాగోగులు చూసుకునేవాడు.
దీనిపై ఊరిలో రకరకాల స్టోరీలు వినిపించేవి. ఆ ఫ్యామిలీకి దిక్కుగా ఉన్నాడులే అనుకొని మరికొందరు సరిపెట్టుకున్నారు. ఆ మహిళ ఫ్యామిలీ కూడా అలానే అనుకుంది. కానీ ఆ వ్యక్తి మాత్రం అక్కడితో ఆగిపోలేదు. సదరు మహిళకు యుక్త వయసు కుమార్తె ఉంది. ఆమెపై కన్నేశాడు వెంకయ్య. లైంగికంగా ఆమెను నిత్యం వేధించేవాడు.
పలుమార్లు హెచ్చరించినా..
తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న వెంకయ్యను... తన కుమార్తె జోలికి రావద్దని ఆ మహిళ పలుమార్లు హెచ్చరించింది. తన కుమార్తెను చెడు దృష్టితో చూడొద్దని వేడుకుంది. అయినా జరుగుబాటు లేకపోవడంతో ఆయన్ను దూరం పెట్టలేకపోయింది. వృద్ధుడైనా అతడిని భరిస్తూ, సహిస్తూ జీవనం కొనసాగించేది. ఆ ఊరి నుంచి వెళ్లిపోలేక, స్థానికంగా ఆర్థిక వసతి లేక ఇబ్బంది పడేది. ఇదే అదనుగా వెంకయ్య చాలాసార్లు మనవరాలు వయసున్న ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. తల్లి, కూతురు ఇద్దరూ కలసి ఎన్నిసార్లు హెచ్చరించినా అతని ప్రవర్తనలో మార్పు లేదు.
చివరకు హత్య..
చివరకు ఓ రోజు తెల్లవారు జామున యువతిపై అత్యాచారం చేయబోయాడు వెంకయ్య. తల్లి బహిర్భూమికి వెళ్లగా వెంకయ్య ఆ యువతిపై లైంగిక దాడికి సిద్ధమయ్యాడు. ఆమె కేకలు వేయడంతో తల్లి ఇంటికి తిరిగొచ్చింది. కూతురిపై అత్యాచారం చేయబోతున్న వెంకయ్యను చూసి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కర్రతో వెంకయ్యను కొట్టింది. ఆ దెబ్బతో అతను కిందపడిపోయాడు. అయితే ఆ గ్రహంతో ఉన్న ఆమె కిందపడిన వెంకయ్యపై రాయితో దాడి చేసింది. రాళ్లతో మోది హత్య చేసింది. అక్కడికక్కడే వెంకయ్య చనిపోయాడు. ఆ తర్వాత తల్లి, కూతురు భయంతో అక్కడినుంచి పారిపోయారు.
ఈ హత్య జరిగి ఆరు నెలలు అవుతోంది. తల్లి, కూతురు అక్కడి నుంచి పారిపోవడంతో పోలీసులు వారిపై అనుమానంతో దర్యాప్తు మొదలు పెట్టారు. చివరకు వారిద్దరినీ పట్టుకున్నారు. తల్లి హత్య చేశానని అంగీకరించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వెంకయ్య నీచత్వం కూడా ఆమె మాటల్లో బయటపడింది. గతంలో పలుమార్లు తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని, సహించినా, భరించినా.. చివరకు హెచ్చరించినా అతని పద్ధతిలో మార్పు రాలేదని ఆమె పోలీసులకు చెప్పింది. చివరకు విధిలేని పరిస్థితుల్లో అతడిని కొట్టి చంపేసినట్టు తెలిపింది. భయంతో అక్కడినుంచి పారిపోయామని పోలీసులకు వివరించింది.
వెంకటాచలం సీఐ గంగాధర్ రావు, ఎస్సైలు ఈకేసును సవాలుగా తీసుకుని పలుకోణాల్లో విచారించి ఛేదించారు. ఎస్సీ విజయరావు పోలీసులను అభినందించి నగదు రివార్డులు ప్రకటించారు. డీఎస్పీ చేతుల మీదుగా నగదు రివార్డులు అందజేశారు.