Nuzvid News : ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో మరోసారి గుప్త నిధుల కలకలం రేగింది. ముసునూరు మండలంలో క్షుద్ర పూజలు చేసి, గుప్తనిధుల కోసం తవ్వకాలు చేసినట్లుగా స్థానికులు గుర్తించారు. అర్ధరాత్రి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా పట్టుబడిన నలుగురు వ్యక్తులను స్థానికులు పోలీసులకు అప్పగించారు. పెదపాటివారిగూడెం గ్రామానికి చెందిన బోడ రాజేష్ అనే రైతు తన నిమ్మతోటలో గుప్తనిధులు ఉన్నాయని భావించి శుక్రవారం అర్ధరాత్రి నిమ్మ తోటలో క్షుద్ర పూజలు చేసి, తవ్వకాలు జరుపుతుండగా గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. నిమ్మ తోట రైతు బోడ రాజేష్ తో పాటు మరో నలుగురు వ్యక్తులు తవ్వకాలు జరుపుతుండగా గ్రామస్తులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో ఒక వ్యక్తి పరారయ్యాడు. పోలీసులకు సమాచారం అందించడంతో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కుటుంబరావు తెలిపారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై చెప్పారు. ఇదే నిమ్మ తోటలో గుప్తనిధుల కోసం అంతకు ముందు కూడా తవ్వకాలు జరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు. చేతబడులు, క్షుద్ర పూజలు చేస్తూ, గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


 ఇదే తరహాలో మరో ఘటన 


నూజివీడు మండలం గొల్లపల్లిలోని ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం వారం రోజులుగా తవ్వకాలు జరిపిన ఘటన అప్పట్లో సంచ‌ల‌నంగా మారింది. ఈ వ్యవహ‌రం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గుప్త నిధుల కోసం ఏకంగా 20 అడుగులు లోతులో ఇంట్లోనే రహస్యంగా తవ్వకాలు జ‌రిగాయి. తవ్వకాల అనంతరం మ‌ట్టిని రాత్రి సమ‌యంలో అత్యంత ర‌హ‌స్యంగా త‌ర‌లించారు. ఈ ఘటన నూజివీడు మండలం గొల్లపల్లిలో చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న వేదాంతం శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో గుట్టుగా గుప్త నిధుల తవ్వకాలు చేశారు. వేదాంతం ఇంట్లో ఎటుచూసిన దేవుళ్లు, గురువుల ఫోటోలే దర్శనమిస్తాయి. వీరిది వందేళ్ల కాలం నాటి పురాతన ఇల్లు అని చెబుతున్నారు.  వంటగది మధ్యలో ఉన్న ఓ గదిలో తవ్వకాలు జరిగాయి. ఇంట్లో ఉన్న మ‌రో రెండు గదులను మ‌ట్టితో నింపేశారు.  ఇంకా త‌వ్వకాలు పూర్తి కాక‌పోవ‌టంతో రాత్రి వేళ ట్రాక్టర్లతో మ‌ట్టిని త‌ర‌లించారు. 


ఇంట్లో గజ్జెల శబ్దం 


ఊరు మధ్యలో వేదాద్రి శ్రీనివాసరావు ఇంట్లో జరిపిన ఈ తవ్వకాలు గ్రామంలో టెన్షన్‌ పుట్టించాయి. తన ఇంట్లో నిధి నిక్షేపాలు ఉన్నాయంటూ తవ్వకాలు జరిపించాడు వేదాద్రి శ్రీనివాసరావు. ఇంటి మధ్యలో 23 అడుగులకు పైగా  భారీ గొయ్యి తవ్వించాడు. అయితే ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వేదాంతం శ్రీనివాసరావు సహా ఐదుగురిని అదుపులోకి తీసుకుని నిందితులను విచారిస్తున్నారు. ఈ వ్యవ‌హారం వెనుక ఎవరెవరూ ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే  అర్ధరాత్రి వేళల్లో కొత్త వ్యక్తులు గ్రామంలో సంచ‌రించ‌టం, వాహ‌నాల్లో రాక‌పోక‌లు సాగించ‌టంతో గ్రామస్తులు పోలీసులు సమాచారం అందించారు.  ఎస్ఐ లక్ష్మణ్ రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి శ్రీనివాసాచార్యులతో పాటు బెంగుళూరుకు చెందిన‌ ప్రేమనాథ్ సింగ్ , పురుషోత్తమరావు, విశాఖ‌ప‌ట్టణానికి చెందిన సందీప్ , తణుకుకు చెందిన‌ దుర్గాప్రసాద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాత్రి వేళలో ఇంటిలో గజ్జెల చప్పుడు వినిపిస్తుండటంతో తవ్వకాలు చేసినట్లు శ్రీనివాసాచార్యులు చెప్పటంతో పోలీసులు ఆశ్చర్యానికి గుర‌య్యారు.


నూజివీడులోనే ఇలా ఎందుకు? 


నూజివీడు ప్రాంతంలోనే ఇలా వరుసగా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చారిత్రక ప్రదేశం కావటం, పూర్వీకుల సంపద ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నాయని విశ్వసించటంతోనే ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని భావిస్తున్నారు. ఆగస్టులో వెలుగులోకి వచ్చిన ఘటన మరువక ముందే, మరోసారి ఇలాంటి వ్యవహరం బయటకు వచ్చింది. వరుసగా రెండు ఘటనలు వెలుగులోకి రావటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.