వ‌రుసకు తండ్రి.. కానీ మ‌ద్యం మ‌త్తులో క‌ళ్లు మూసుకుపోయాయి. దీంతో అభం శుభం ఎరుగ‌ని బాలిక‌లపై దాష్టీకానికి పాల్పడుతున్నారు. వ‌రుసగా రెండు ఘ‌ట‌న‌లు వెలుగు లోకి రావ‌టం క‌ల‌క‌లం రేపింది. ఓ ఘ‌ట‌న‌లో అయితే బాలికపై ప‌శువుగా మారి అఘాయిత్యానికి పాల్ప‌డిన వ్య‌క్తి పై స్థానికులు దాడి చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన రెండు ఘటనలు క‌ల‌కం రేపాయి. సవతి తండ్రి అఘాయిత్యానికి పాల్పడితే, మరోచోట వరసుకు బాబాయి బాలిక పై అత్యాచార యత్నానికి పాల్పడి బాలిక తల్లిదండ్రుల చేతిలో దెబ్బలు తిని చనిపోయాడు.


అసలేం జరిగిందంటే.. 
చందర్ల పాడు మండలం కోనాయపాలెంలో ఓ వివాహితకు ఇద్దరు కుమార్తెలు. ఆమె భర్త 10 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించడంతో కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన బత్తిన కొండలును రెండో వివాహం చేసుకుంది. ఆమె కుమార్తెలిద్దరు కోనాయపాలెంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. దంపతులు ఇద్దరు పామర్రు సమీపంలోని వేల్పుల గ్రామానికి కూలి పనులకు వెళ్లారు. ఈ 21న భర్త కొండలు భార్యకు చెప్పకుండా కోనాయపాలెం వచ్చి పెద్ద కుమార్తెకు నిద్రమాత్రలు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్న కుమార్తె కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చే సమయానికి కొండలు పరారయ్యాడు. గతంలో కూడా అతడు బాలిక పై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించి పైశాచిక ఆనందం పొందాడు.


పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు.. 
బాలిక తల్లి ఈ నెల 28న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొండలుపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తిరువూరు మండలం ఆంజనేయపురంలో 32 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల ఇడుపులపాటి దాసు మద్యం మత్తులో వరుసకు కూతురైన నాలుగేళ్ల బాలికపై క‌న్నేశాడు. ఎవ్వ‌రూ లేని స‌మ‌యంలో చాక్లెట్ల ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక  ప‌రిస్థితి పై అనుమానం వ‌చ్చి ప్ర‌శ్నించారు. దీంతో జ‌రిగిన ఘోరాన్ని వ‌చ్చి రాని మాటల్లో చెప్పింది బాలిక. చిన్నారి త‌ల్లిదండ్రులు తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు.


విష‌యం చుట్టు ప‌క్క‌ల వారికి  కూడా తెలియ‌టంతో, వారంతా ఏకం అయ్యారు. బాలిక పై జ‌రిగిన అఘాయిత్యానికి కార‌ణం అయిన దాసును ప‌ట్టుకుని క‌రెంట్ పోల్ కు క‌ట్టేశారు. ఆ త‌రువాత అత‌న్ని చిత‌క్కొట్టారు. విష‌యం పోలీసుల‌కు తెలియ‌టంతో వారు రంగంలోకి దిగారు. గ్రామ‌స్తుల‌తో మాట్లాడి దాస్ ను బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే అప్ప‌టికి అంతంత మాత్రంగా ఉన్న దాస్ ఆరోగ్య ప‌రిస్దితి క్షీణించ‌టంతో మ‌ర‌ణించాడ‌ని వైద్యులు తెలిపారు. వ‌రుస‌గా ఇలాంటి ఘ‌ట‌న‌లు వెలుగులోకి రావ‌టంతో జిల్లాలో క‌ల‌క‌లం రేపింది.


ఉమ్మడ గుంటూరు జిల్లాలో కొన్ని నెలల నుంచి ఇలాంటి ఘటనలు అధికంగా వెలుగుచూశాయి. కొన్ని కేసులలో చిన్నారులు బాధితులు కాగా, మరికొన్ని కేసులలో వివాహితలు, వితంతువులను లక్ష్యంగా చేసుకుని కీచక పర్వానికి దిగారు నిందితులు. ఇలాంటి ఘటనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని పోలీసులు చెబుతున్నారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని, దాని వల్ల జీవితాలు నాశనం అవుతాయని సైతం సూచిస్తున్నారు.