Noida Crime News: అప్పటికే ఆమెకు పెళ్లి అయింది. కానీ మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే అతడితో కలిసి జీవితాంతం ఉండాలనుకుంది. ఇందుకు అడ్డుగా ఉన్న భర్తను చంపేందుకు పథకం పన్నింది. ప్రియుడి సాయంతో కట్టుకున్న వాడినే కడతేర్చింది. ఆ తర్వాత నిర్మాణ దశలో ఉ్న సెప్టిక్ ట్యాంక్ లో వేసి పూడ్చేసింది. ఏమీ తెలియనట్లుగా జీవితాన్ని హాయిగా గడుపుతోంది. అయితే తన అన్నయ్య చాలా రోజుల నుంచి కనిపించకుండా పోవడంతో మృతుడి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుల ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ నుంచి బయటకు తీశారు. ఆపై పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 


అసలేం జరిగిందంటే..?


ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ శహర్ కు చెందిన సతీష్, నీతు దంపతులు. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఓ బాబు కూడా పుట్టాడు. అయితే రెండేళ్ల క్రితం భార్య, భర్తలిద్దరూ పిల్లాడితో సహా నోయిడాకు వచ్చేశారు. స్థానిక సరస్వతి కుంజ్ లో సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నారు. ఇంటిని నిర్మించేందుకు తాపీ మేస్త్రీ హర్పాల్ అనే వ్యక్తితో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే ప్రతి రోజూ ఇంటిని నిర్మాణ పనులు చేసేందుకు వస్తున్న మేస్త్రీతో... నీతూకు స్నేహం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధంగా మారింది. అతడితోనే జీవితాంతం కలిసి ఉండాలని ప్లాన్ కూడా వేసింది. ఈ క్రమంలోనే భర్త సతీష్ ను చంపేయాలనుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడు హర్పాల్ కు తెలిపింది. ఇద్దరూ కలిసి సతీష్ ను హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. 


అన్నయ్య కనిపించడం లేదని తమ్ముడు ఫిర్యాదు చేయడంతో..


జనవరి 2వ తేదీన భర్త మద్యం మత్తులో ఉండడంతో.. ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఇధ్దరూ కలిసి సతీష్ గొంతు నులిమి చంపేశారు. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా ఇద్దరూ పక్కనే నిర్మాణ దశలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో శవాన్ని పూడ్చేసింది. ఆపై ప్రియుడు హర్పాల్.. దాని పైనుంచి ప్లాస్టరింగ్ చేశాడు. ఈ క్రమంలోనే తన సోదరుడు కనిపించడం లేదంటూ సతీష్ సోదరుడు ఈనెల 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సతీష్ భార్య నీతూను ప్రశ్నించారు. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వారి స్టైల్ లో ఇంటరాగేట్ చేయగా.. ప్రియుడితో కలిసి తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. ప్రియుడు హర్పాల్ తో జీవితం కోసమే భర్తను చంపి సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చేశామని వివరించింది. ఈ క్రమంలోనే పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు నోయిడా అదనపు డీసీపీ విశాల్ పాండే తెలిపారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.