Nizamabad Crime News: ఆమె పుట్టినప్పటి నుంచి అపురూపంగా చూసుకున్నారు. ఓ అయ్య చేతిలో పెట్టి తమ బాధ్యత తీర్చుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఓ అబ్బాయిని చూశారు. అతడితో ఆమెకు పెళ్లి నిశ్చయించారు. నిశ్చితార్థం కూడా చేశారు. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. పెళ్లికి వంటల దగ్గర నుంచి అమ్మాయికి ఇచ్చే కట్నకానుల వరకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. పచ్చని పందిరి మధ్య బంధువులు, మిత్రులు తెగ సందడి చేశారు. తమ కూతురు పెళ్లని తెగ మురిసిపోయారు. కానీ వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


అసలేం జరిగిందంటే..?


పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రానికి చెందిన ర్యాగల రవళిని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సంతోశ్​ కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అమ్మాయి, అబ్బాయిలు అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. పెళ్లి తర్వాత జీవితం చాలా బాగుంటుందని భావించిన ఆ అమ్మాయికి.. అతడిపై అనుమానం మొదలైంది. అతడు మాట్లాడే మాటలు చూస్తుంటే తనను బాగా చూసుకోలేడనే భావన కలిగింది. కానీ తన పెళ్లి అని సంతోషంగా ఉన్న ఆ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే ఎక్కడ బాధపడతారో అని తన మనసులోనే దాచుకుంది. పైకి నవ్వుతూ, పెళ్లి ఏర్పాట్లలో పాల్గొంటూనే లోలోపల మదనపడుతోంది. అయితే ఆదివారం నిజామాబాద్​లో మధ్యాహ్నం 12:15 గంటలకు వివాహం జరిపేందుకు తల్లిదండ్రులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ అతనితో కలిసి అస్సలే జీవించలేనని భావించిన ఆ అమ్మాయికి ఏం చేయాలో పాలుపోలేదు. పెళ్లికి ముందే ప్రాణం తీసుకుంటే తన వల్ల కుటుంబ సభ్యుల పరువు పోదని, తనకు బాధతప్పుతుందని భావించింది. ఇంట్లో అందరూ చుట్టాలు ఉండగానే.. ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 


కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..


అయితే చాలా సేపటి నుంచి కూతురు కనిపించకపోవడంతో అందరూ ఆమె గురించి వెతికారు. చివరకు రూంలో ఉందనుకొని తలుపులు కొట్టారు. ఎంతకూ గది తలుపులు తెరవకపోవడంతో.. తలుపులు పగులగొట్టారు. మరికొన్ని గంటల్లో పెళ్లి కూతురులా ముస్తాబై, ఆనందంగా అత్తగారింటికి వెళ్లాల్సిన ఆ అమ్మాయి ఉరికి వేలాడుతూ కనిపించింది. ఇది చూసి షాకైన తల్లిదండ్రులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. పెళ్లి చూసేందుకు వచ్చిన బంధువులు, స్నేహితులు కూడా యువతి అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వస్తోందంటూ కంటతడి పెట్టారు. స్థానికుల ద్వారా విషషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పెళ్లి కుమారుడు మానసికంగా వేధించడంతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని యువతి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పోస్టుమార్టం నిమిత్తం రవళి మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.