Nizamabad Crime : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన జరిగింది. బాలికపై ఐదుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో 5 గురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. నిజామాబాద్ లోని ఓ కాలనీకి బాలిక(16)పై 5 గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక కుటుంబ సభ్యులు స్థానిక 5వ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి ఈ ఘటనలో 5 గురు యువకులను రిమాండ్ చేశారు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగింది?
వారం రోజుల క్రితం బాలికకు కేక్ లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశారని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొ్న్నారు. బాలిక పరిస్థితిని గమనించి కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న యువకులను నిలదీయగా ఓ వర్గానికి చెందిన 20 మంది యువకులు కర్రలతో వారిపై దాడి చేశారు. దీంతో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు చేయాలని బీజేపీ నాయకులు పోలీసులను నిలదీయడంతో ఫిర్యాదు లేనిదే తాము ఎలాంటి విచారణ చేపట్టలేమని స్పష్టం చేసినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేయడంతో వారు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బాలికను పోలీసులు విచారించారు. బాలిక స్టేట్మెంట్ తో అత్యాచారం జరిగినట్లు అనుమానంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక వైద్యపరీక్షలు గోప్యంగా ఉంచి నిందితులను ఆదివారం రిమాండ్ కు పంపారు. పోక్సో చట్టం కింద పోలీస్ కేసు నమోదు చేసినట్లు 5వ టౌన్ పోలీసులు తెలిపారు.
క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యం
జూబ్లీహిల్స్ లో బాలికపై సామూహిత అత్యాచారం ఘటన మరవక ముందే హైదరాబాద్ లో మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికపై క్యాబ్ డ్రైవర్, అతడి స్నేహితులు దారుణానికి పాల్పడ్డారు. అయితే ఈ కేసు వివరాలు బయటకు రాకుండా పోలీసులు చూస్తున్నారని విమర్శలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఘటన సంచలనం అవ్వడంతో ఈ కేసు వివరాలు బయటకు రాకుండా చూస్తున్నారని సమాచారం. మరో మైనర్ బాలిక(13)ను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసి, ఓ రాత్రంతా వేరే చోట ఉంచి స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తిరిగి ఎక్కడ నుంచి తీసుకెళ్లాడో అక్కడే విడిచిపెట్టిన ఘటన ఓల్డ్ సిటీ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సదరు క్యాబ్ డ్రైవర్ సహా ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.