Nizamabad Crime News: ఆ అక్కాచెల్లెల్లిద్దరూ ఒకేచోట కలిసి ఉంటున్నారు. వృద్ధాప్యంలోనూ తమ పనులు తామే చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే రోజూలాగే ఇంట్లో పడుకున్న ఆ ఇద్దరు అక్కాచెల్లెల్లను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వారిద్దరికీ నిప్పంటించి వెళ్లిపోయారు. ఉదయం పొగలు వస్తుంటే చూసిన స్థానికులు.. వెంటనే వెళ్లి కిటికీలు పగులగొట్టి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే వారికి ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. తీవ్రంగా భయపడిపోయిన వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 


అసలేం జరిగిందంటే...?


నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని జిరాయాత్ నగర్ లో ఇద్దరు అక్కాచెల్లెలు మగ్గిడి గంగవ్వ (62), మగ్గిడి రాజవ్వ (72) లు నివాసం ఉంటున్నారు. అయితే గత 20 సంవత్సరాలుగా ఈ ఇద్దరు అక్కాచెల్లెలు అక్కడే ఒంటరిగా నివసిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆదివారం రోజు మల్లన్న గుట్ట వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఓ పండుగలో ఈ అక్కా చెల్లెల్లు ఇద్దరూ పాల్గొన్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం గంగవ్వ కుమారుడు వారిద్దరినీ మామిడి పల్లి నుండి జిరాయాత్ నగర్ లోని మృతులు ఉంటున్న ఇంట్లో దిగపెట్టి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అనంతరం వేకువజామున ఇంట్లో నుండి పొగలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కిటికీలు బద్దలు కొట్టి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మంటల ధాటికి చనిపోయిన అక్కాచెల్లెల్లు కనిపించారు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆధారాలు సేకరించేందుకు డాగ్ స్క్వాడ్స్ ను కూడా రప్పించారు. అయితే ఇద్దరు మహిళల వద్ద దాదాపు 15 నుంచి 20 తులాల బంగారం ఉందని... వాటికోసమే ఎవరైనా హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు. 


హైదరాబాద్ లో తల్లి పొట్టను చీల్చిన కుమారుడు


కర్ణాటకకు చెందిన 57 ఏళ్ల సంగీత బల్కంపేటలో కొడుకు సంతోశ్ (24)​తో కలిసి నివాసం ఉండేది. అనారోగ్యం బారిన పడిన సంగీత భర్త వీరప్ప ఏడాది క్రితం చనిపోయాడు. సంగీతకు ఓ కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకైన సంతోష్ కు మతిస్థిమితం సరిగా లేదని అప్పట్లో స్థానికులు చెప్పారు. అయితే, సంగీత ఇళ్లలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. కుమార్తెకు వివాహం కాగా, పెద్ద కొడుకు, చివరి కొడుకు సంతోష్ కు వివాహాలు కావాల్సి ఉంది. 


పెద్దకొడుకు ఆటో డ్రైవర్ గా పని చేసుకుంటుండగా, చిన్న కొడుకు సంతోష్‌ జులాయిగా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డాడు. 2021 జనవరి నెలలో రోజూ మాదిరిగానే ఇళ్లలో పని చేసిన సంగీత మధ్యాహ్నం 1.30 గంటలకు ఇంటికి వచ్చింది. డబ్బుల కోసం సంతోష్‌ తల్లితో గొడవ పడ్డాడు. డబ్బులు ఇవ్వడానికి తల్లి ఒప్పుకోకపోవడంతో ఇంట్లో కూరగాయలు తరిగే కత్తి తీసుకొచ్చి తల్లి పొట్ట భాగంలో పొడిచాడు. అదే కత్తితో పొట్టను చీరేశాడు. పేగులు మొత్తం బయటకు లాగేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి కోర్టుకు పంపించారు. ఈ ఘటనలో కన్నతల్లిని కడతేర్చిన కసాయి కుమారుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రెండు సంవత్సరాల క్రితం ఈ నేరం హైదరాబాద్ లో జరగ్గా, తాజాగా నిందితుడ్ని కోర్టు దోషిగా తేల్చి శిక్ష వేసింది. హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్కంపేట్ లో ఈ దారుణం జరిగింది.