Facebook Love: ఓ ఆన్ లైన్ పరిచయం మరో ఘోరమైన నేరానికి దారి తీసింది. గతంలో ఎన్నో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయినా ఓ పెళ్లైన మహిళ గుడ్డిగా నమ్మేసి ఓ వ్యక్తి కోసం రాష్ట్రాలు దాటేసి వెళ్లిపోయింది. చివరికి అతణ్ని కలుసుకుంది. మొత్తానికి అతని చేతిలోనే శవంగా మారింది. ఆమె నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నుంచి ఏకంగా ఉత్తర్ ప్రదేశ్ వెళ్లిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనలో హతురాలు తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన ఉస్మా బేగం అనే 32 ఏళ్ల పెళ్లైన మహిళగా గుర్తించారు. యూపీలోని గజరౌలా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చెక్‌మేట్‌ సెక్యూరిటీ కంపెనీ ఆవరణలో మూడు రోజుల కిందట మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు శనివారం హత్య మిస్టరీని ఛేదించారు.


అయితే, ఆ వివాహితకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఆమె వెళ్లిపోవడానికి కారణం భర్తతో గొడవలు జరిగి ఉండడమే అని నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ పోలీసులు తెలిపారు. 


ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు నిందితుడు షెహజాద్‌ను తమ కస్టడీలోకి తీసుకొని విచారణ చేయడంతో ఫేస్‌బుక్‌ ప్రేమ కథ మొత్తం బయటపడింది. ఉత్తర్ ప్రదేశ్ లోని అమ్రోహా జిల్లా ఎస్పీ ఆదిత్య లంగే మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. బాన్సువాడకు చెందిన ఉస్మాన్ బేగంకు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన షెహజాద్ అనే వ్యక్తి ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు. అది ప్రేమగా మారింది. ఆయన్ను కలిసేందుకు ఈ నెల నవంబరు 6న బాన్సువాడలోని తన ఇంటి నుంచి బయలుదేరిన ఉస్మా బేగం అతడి సూచన మేరకు గజరౌలా చేరింది. షెహజాద్‌ను కలుసుకుంది. ఆమె పెళ్లి చేసుకొందామని ఒత్తిడి తెచ్చింది. దీంతో సహనం కోల్పోయిన షెహజాద్‌ ఓ తుండుతో ఆమెను కట్టేసి, ఇటుకతో కొట్టాడు. తలపై చితకబాదడంతో ఆమె చనిపోయింది. ఆ తర్వాత అతను పని చేసే కంపెనీ ఆవరణలో ఓ మూలన యువతి మృత దేహాన్ని పడేసి వెళ్లిపోయాడు.


బాన్సువాడలో మిస్సింగ్ కేసు నమోదు


ఉస్మా బేగం తన భర్త ముఖీద్‌తో కలిసి బాన్సువాడలో నివాసం ఉంటుంది. ఉస్మా బేగం ఈ నెల 6న కనిపించకుండా పోయింది. దీంతో ఆమె భర్త బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. ఇంతలోనే యూపీలో ఉస్మా బేగం హత్యకు గురైనట్లు అక్కడి పోలీసులు సమాచారం అందింది. 12 ఏళ్ల కిందట బాన్సువాడకు చెందిన ముఖీద్‌తో ఆమెకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరి మధ్య మనస్పర్ధలు రావటంతో 2 నెలలు నిజామాబాద్‌లో ఉంది. పెద్దలు రాజీ చేయడంతో ఈ నెల 4న బాన్సువాడకు కాపురానికి వెళ్లింది. తిరిగి రెండు రోజుల్లోనే అదృశ్యమై ఆ తర్వాత యూపీలో హత్యకు గురయింది. మృత దేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు మృతురాలి తల్లిదండ్రులను పోలీసులు ఉత్తర్ ప్రదేశ్ కు పంపారు.