Nizamabad Youth foud dead:
ప్రేమ వ్యవహారంతో 3 నెలల కిందట యువకుడు అదృశ్యం, కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యం
నిజామాబాద్ జిల్లా
- బోధన్ మండలం ఖండ్ గావ్ లో విషాధంగా మారిన మిస్సింగ్ ఉదంతం
- ప్రేమ వ్యవహారం లో మూడు నెలల క్రితం అదృశ్యమైన యువకుడు శ్రీకాంత్
- బోధన్ శివారులో కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహం లభ్యం
నిజామాబాద్ జిల్లాలో యువకుడి మిస్సింగ్ కేసు, మృతితో మరింత మిస్టరీగా మారింది. మూడు నెలల కిందట అదృశ్యమైన బోధన్ కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు శవమై కనిపించాడు. ప్రేమ వ్యవహారమే యువకుడు శ్రీకాంత్ ప్రాణాల్ని తీసినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసింది. యువతి బంధువులు ప్రియుడు శ్రీకాంత్ ను బెదిరించినట్లు అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో 3 నెలల కిందట యువకుడు శ్రీకాంత్ అదృశ్యమయ్యాడు. ఎక్కడ వెతికినా శ్రీకాంత్ జాడ మాత్రం దొరకలేదు. కొడుకు మిస్సింగ్ కావడంపై ఫిర్యాదు చేసిన అతడి తల్లిదండ్రులు.. శ్రీకాంత్ జాడ తెలపాలంటూ పోస్టర్లు కూడా వేసినా ప్రయోజనం లేకపోయింది. ఎప్పటికైనా అతను తిరిగి వస్తాడనే ఆశతో ఉన్న వారికి కుమారుడు చనిపోయాడని తెలియడంతో కన్నీటి పర్యంతమయ్యారు.
విషాదంగా మారిన యువకుడి మిస్సింగ్ మిస్టరీ
ఇన్ని రోజుల తరువాత శ్రీకాంత్ శవమై కనిపించాడు. చెట్టుకు ఉరి వేసి అతడ్ని అమ్మాయి తరఫు బంధువులు, కుటుంబసభ్యులు హత్య చేసి ఉంటారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. అమ్మాయి తరఫు వారే ఈ హత్య చేసినట్లు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. యువతి కుటుంబసభ్యులను, బంధువులను అరెస్ట్ చేయాలని పసుపు కుంట వద్ద శ్రీకాంత్ కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు బీజేపీ నేతలు అండగా ఉంటామని తెలిపారు. దోషులు ఎవరో తేలేవరకు పోరాటం చేస్తామని, పోలీసులు కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కొన్ని గంటల్లో పెళ్లి, ఇంతలో ఉరేసుకున్న పెళ్లి కూతురు
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రానికి చెందిన ర్యాగల రవళిని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సంతోశ్ కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అమ్మాయి, అబ్బాయిలు అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. పెళ్లి తర్వాత జీవితం చాలా బాగుంటుందని భావించిన ఆ అమ్మాయికి.. అతడిపై అనుమానం మొదలైంది. అతడు మాట్లాడే మాటలు చూస్తుంటే తనను బాగా చూసుకోలేడనే భావన కలిగింది. కానీ తన పెళ్లి అని సంతోషంగా ఉన్న ఆ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే ఎక్కడ బాధపడతారో అని తన మనసులోనే దాచుకుంది. పైకి నవ్వుతూ, పెళ్లి ఏర్పాట్లలో పాల్గొంటూనే లోలోపల మదనపడుతోంది. అయితే ఆదివారం నిజామాబాద్లో మధ్యాహ్నం 12:15 గంటలకు వివాహం జరిపేందుకు తల్లిదండ్రులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ అతనితో కలిసి అస్సలే జీవించలేనని భావించిన ఆ అమ్మాయికి ఏం చేయాలో పాలుపోలేదు. పెళ్లికి ముందే ప్రాణం తీసుకుంటే తన వల్ల కుటుంబ సభ్యుల పరువు పోదని, తనకు బాధతప్పుతుందని భావించింది. ఇంట్లో అందరూ చుట్టాలు ఉండగానే.. ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.