Nellore Knife Attack : నెల్లూరులోని బారాషహీద్ దర్గా సమీపంలో వైసీపీ నేత సమీర్ ఖాన్ పై హత్యాయత్నం జరిగింది. ఆయన్ను మరో మైనార్టీ నేత సయ్యద్ సమీ కత్తితో పొడిచినట్టు సమాచారం. తీవ్ర గాయాలతో ఉన్న సమీర్ ఖాన్ ను నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమీర్ ఖాన్ ను మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు. సమీర్ ఖాన్ పై దాడి ఘటనను ఖండించారు. నెల్లూరులో ఓ ఎమ్మెల్యే ప్రోత్సహించడం వల్లే మతం ముసుగులో అరాచకవాది పెట్రేగిపోతున్నారని మండిపడ్డారు. యాంటీ సోషల్ ఎలిమెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు ఈ వ్యవహారాన్ని తేలిగ్గా వదిలిపెట్టకూడదన్నారు. మైనార్టీ నేత సయ్యద్ సమి ప్రస్తుతం నాలుగో పట్టణ పోలీసుల అదుపులో ఉన్నారు.
"వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న సమీర్ పై దాడి చేశారు. ముస్లిం ముసుగులో సయ్యద్ దాడులకు పాల్పడుతున్నాడు. మేము ఏదో మర్డర్ చేస్తామని మాపై ఆరోపణలు చేశారు. సయ్యద్ ను కొందరు ప్రోత్సహిస్తున్నారు. సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు వివాదంతో సమీర్ పై దాడి చేశాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని అపోలో ఆసుపత్రికి తరలించారు. ముస్లిం సోదరులకు సయ్యద్ ఒక మచ్చ. ఇలాంటి వారిని పోత్సహించవద్దని చెబుతున్నాను. వైసీపీ వీడిన ఎమ్మెల్యే అనుచరుడిగా ఉన్నాడు సయ్యద్. ఈ దాడిలోపాల్గొన్న వారందరినీ కఠినంగా శిక్షించాలి." - ఎమ్మెల్యే అనిల్ కుమార్
కోటంరెడ్డి వర్సెస్ అనిల్
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కోటంరెడ్డిపై తరచూ ఫైర్ అవుతున్నారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోటంరెడ్డికి సవాల్ విసిరారు. రాజీనామా చేస్తే ట్యాపింగ్ వ్యవహారం నిగ్గు తేలుస్తామన్నారు. నిజంగా ట్యాపింగ్ జరిగిందని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవి వదిలేసుకుంటానన్నారు అనిల్ సవాల్ విసిరారు. ట్యాపింగ్ జరగలేదని తాము నిరూపిస్తే కోటంరెడ్డి ఎమ్మెల్యే పదవిని వదిలేసుకోవాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పౌరుషం ఉంటే, ఆత్మాభిమానం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని, కార్పొరేటర్లు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ఆత్మాభిమానం ఉంది, 13 నెలల అధికారం వదులుకున్నాను, సెక్యూరిటీని త్యాగం చేశాను అంటూ కబుర్లు చెప్పే బదులు ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయొచ్చు కదా అని అడిగారు. రాజీనామా చేయండి, ఆత్మాభిమానం చాటుకోండి అంటూ సవాల్ విసిరారు. దయచేసి మీడియా ముందుకొచ్చి పదే పదే ఆత్మాభిమానం అని చెప్పుకోవద్దని సూచించారు.
కోటంరెడ్డి కౌంటర్
టీడీపీ గుర్తు మీద గెలిచి వైసీపీలో చేరిన వాళ్లను స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయించి, ఎన్నికల్లో గెలిచి అప్పుడు తన రాజీనామా గురించి మాట్లాడాలని కోటంరెడ్డి అనిల్ కుమార్ కు కౌంటర్ ఇచ్చారు. మీరు చేస్తే పవిత్రం, నేను చేస్తే అపవిత్రమా? అని ప్రశ్నించారు. తాను లేవనెత్తిన సమస్యలు పరిష్కరించమనే కోరుతున్నానన్నారు. ఒక స్థానిక ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలు లేవనెత్తాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గణేష్ ఘాట్ అభివృద్ధి తానే చేశానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. నాటి తెలుగుదేశం మంత్రులు, నాయకులందరూ కలిసి చేశారన్నారు. ఆదాల రూరల్ అభ్యర్థిని అని చెబుతూనే ఐదేళ్లకోసారి నిర్ణయం తీసుకుంటానని మాట మార్చారన్నారు. తాను ఎవరి ట్రాప్ లో పడనని, ప్రజల ట్రాప్ లో ఉంటానన్నారు. ఒక్క ఎమ్మెల్యే కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ట్రాప్ వేయాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ నుంచి పోటీ చేయాలన్నది తన ఆకాంక్ష అని తేల్చిచెప్పారు.