నెల్లూరు జిల్లాలో గుర్తు తెలియని మహిళ శవం కలకలం రేపింది. కావలి పట్టణం శివారు ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ శవం కాలిపోయి పడి ఉండటం చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అసలు ఆమె ఎవరు, ఎక్కడినుంచి తీసుకొచ్చారు, ఇక్కడే ఎందుకు తగలబెట్టారంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. 


గుర్తు తెలియని ఓ మహిళ (35) మృతదేహాన్ని కావలి పట్టణం ఉత్తర శివారు ప్రాంతంలోని వెంగయ్యగారిపాలెం సమీపంలో ఓ ప్రైవేట్‌ లేఅవుట్‌ లో స్థానికులు గుర్తించారు. కావలి మండలం అల్లిగుంటపాలెంకు చెందిన కల్లు గీత కార్మికుడు ఇసారపు వెంకటస్వామి ఉదయం కల్లు గీత కోసం పట్టణం పరిధిలోని వెంగయ్యగారిపాలెం సమీపంలో వెళ్తున్నాడు. ఓ ప్రైవేట్ లే అవుట్ పక్కనుంచి అతను నడుచుకుంటూ వెళ్తుండగా.. దూరంగా ఏదో కాలుతున్నట్టు కనిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా శవం తగలబడుతున్నట్టు అర్థమైంది. దీంతో ఆయన మొదట భయంతో పరుగులు పెట్టాడు. ఆ తర్వాత కావలి వీఆర్వోకి సమాచారమిచ్చాడు. కావలి బిట్‌-1 వీఆర్వో పర్వత రెడ్డి గిరిధర్‌ ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కావలి పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మహిళ మృతదేహం అని గుర్తించారు కానీ, ఆమెకు సంబంధించిన ఆనవాళ్లేవీ అక్కడ లభించలేదు. ఆమె ఆనవాళ్లను కూడా నిందితులు మాయం చేశారు. 


స్థానికంగా వివరాలు సేకరించినా ఎవరూ ఏమీ చెప్పలేదు. దీంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. కావలి అడిషనల్‌ ఎస్పీ దేవరకొండ ప్రసాద్‌, సీఐ కె.శ్రీనివాసరావు తమ సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కాళ్లను బట్టి మృతి చెందినది మహిళ అని గుర్తించారు. కానీ అక్కడ ఆధారాలేవీ దొరకలేదు. ఆ ప్రాంతం జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో ఎక్కడో ఆ మహిళను చంపి అక్కడకు తీసుకువచ్చి దహనం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని మహిళ హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.


కూపీ లాగుతున్న పోలీసులు..
ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు కావలిలో జరగలేదు. దగ్గర్లో కూడా ఎక్కడా మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో చుట్టు పక్కల జిల్లాల్లో మహిళల మిస్సింగ్ కేసులు ఏవైనా నమోదయ్యాయా అనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు. దుండగులు ఏ వాహనంలో వచ్చారు, ఉదయం సమయంలో గుర్తు తెలియని వాహనాల రాకపోకల్ని ఎవరైనా గుర్తించారా అని ఆరా తీస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ కేసు ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు.