నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో దారుణం జరిగింది. స్కూల్ పిల్లలు చూస్తుండగానే ఆ స్కూల్ లో మధ్యాహ్న భోజనం వండే ఆయాను ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. పిల్లలందరూ మధ్యాహ్నం భోజనానికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా వారంతా షాకయ్యారు. భయంతో క్లాస్ రూమ్ లోకి వెళ్లిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
అసలేం జరిగింది?
నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం, విరువూరు గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఎప్పటిలాగే రోజు స్కూల్ కి వచ్చారు విద్యార్థులు. మధ్యాహ్న భోజనం వండే ఆయా విజయలక్ష్మి కూడా ఉదయాన్నే స్కూల్ కి చేరుకుని వంట పని ప్రారంభించింది. వంట పూర్తయింది. మధ్యాహ్నం పిల్లలు భోజనం కూడా తిన్నారు. అయితే అంతలోనే ఊహించని ఘటన జరిగింది. విజయలక్ష్మి కూడా ప్రమాదాన్ని ఊహించలేదు. ఆమె భర్త వెంకటేశ్వర్లు స్కూల్ కి వచ్చాడు. భర్తను చూసిన విజయలక్ష్మి కీడు శంకించింది. అప్పటికే వారి మధ్య గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అతను సడన్ గా స్కూల్ కి వచ్చేసరికి విజయలక్ష్మి భయపడింది. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయేలోగా వెంకటేశ్వర్లు దాడికి తెగబడ్డాడు. తనతోపాటు తెచ్చుకున్న కత్తిని తీసి విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన విజయలక్ష్మికి తీవ్ర రక్తస్రావం అయింది. స్కూల్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. పోలీసులు సమాచారం అందుకుని స్కూల్ వద్దకు వచ్చారు. హంతకుడు వెంకటేశ్వర్లు అక్కడి నుంచి పారిపోయాడు.
అనుమానమే పెనుభూతమై
భార్య విజయలక్ష్మిపై భర్త వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా అనుమానం పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆమెతో చాలాసార్లు వాగ్వాదం జరిగింది. ఇంటి చుట్టుపక్కల వారికి కూడా వీరి గొడవలు తెలుసు. ఇటీవల అనుమానం మరింత పెరిగిపోయిందని అందుకే తరచూ గొడవలు పడేవారని అంటున్నారు చుట్టుపక్కల వారు. అయితే ఈరోజు సడన్ గా వెంకటేశ్వర్లు భార్యని హతమార్చడం మాత్రం దారుణం అని అంటున్నారు.
భయపడిపోయిన పిల్లలు
తమ కళ్లెదుటే హత్య జరగడంతో స్కూల్ పిల్లలు భయపడిపోయారు. వారంతా భయంతో పరుగులు తీశారు. హత్య విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే స్కూల్ కి చేరుకుని తమ పిల్లల్ని అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. సంఘటనా స్థలం రక్తపు మడుగుగా మారిపోయింది. విచక్షణారహితంగా భార్యపై వెంకటేశ్వర్లు దాడి చేసినట్టు తెలుస్తోంది. దాడి తర్వాత ఆయుధం తీసుకుని వెంకటేశ్వర్లు అక్కడినుంచి పారిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల గాలించారు. వెంకటేశ్వర్లు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. మధ్యాహ్న భోజన కార్మికురాలు స్కూల్ లోనే మృతి చెందింది అని తెలియడంతో గ్రామస్తులు షాక్ కి గురయ్యారు. ఆమె స్కూల్ లో అందరితో కలుపుగోలుగా ఉండేదని అంటున్నారు. అలాంటి మహిళ ఇలా దారుణ హత్యకు గురి కావడంతో స్కూల్ సిబ్బంది కూడా భయంతో వణికిపోయారు. షాక్ కి గురయ్యారు.