Nellore Crime News: నెల్లూరు జిల్లాలో ఇటీవల ట్రాన్స్ జెండర్ ఆపరేషన్(Transgender Operation) వికటించి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురిని నెల్లూరు పోలీసులు(Nellore Police) అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్ కి పంపించారు. ఆపరేషన్ చేయలేమని తెలిసి, ఆపరేషన్ వికటిస్తే ప్రాణం పోతుందని తెలిసి కూడా ఆ యువకుడి ప్రాణంతో చెలగాటమాడారని పోలీసులు తెలిపారు. ప్రాణం పోయిన తర్వాత వెంటనే ముగ్గురూ పారిపోయారన్నారు.
అసలేం జరిగిందంటే?
ఫిబ్రవరి 23న నెల్లూరు నగరంలోని లాడ్జ్(Lodge)లో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతిచెంది ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. లాడ్జ్ సిబ్బంది సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రకాశం(Prakasam) జిల్లా జరుగుమల్లి మండలంలోని కామేపల్లికి చెందిన బల్లికూరు శ్రీకాంత్ అలియాస్ అమూల్య కొంతకాలంగా విశాఖపట్నం సింగరాయమెట్టు మురళీనగర్ కు చెందిన గురుగుబిల్లి మోనాలిసా అలియాస్ అశోక్ తో స్నేహంగా ఉంటూ పలు ప్రాంతాలు తిరిగారు. వీరిద్దరూ ట్రాన్స్ జెండర్లు. అయితే శ్రీకాంత్ ఆపరేషన్ చేయించుకోలేదు. మగవాడిగా ఉంటూనే, ఆడవారిగా వేషధారణ చేసుకునేవాడు. అతడికి అమ్మాయి లక్షణాలు ఉండటంతో తల్లిదండ్రులు పెళ్లి చేసినా భార్యతో కాపురం చేయలేదు. తర్వాత విడాకులు తీసుకున్నాడు. మోనాలిసాతో స్నేహం కుదిరాక ఇద్దరూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్లి వస్తుండేవారు. ఈ క్రమంలో వీరికి నెల్లూరు జిల్లా కలువాయి గ్రామానికి చెందిన అరిబోయిన మస్తాన్ బాబు, కొండాపురం మండలం కొత్తపేటకు చెందిన నలగట్ల జీవతో పరిచయమైంది.
లింగ మార్పిడి కోసం ఆపరేషన్
ఒకరోజు శ్రీకాంత్ అలియాస్ అమూల్యను ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా మిగతా ముగ్గురు ఒత్తిడి తెచ్చారు. తమతో కలిసి తిరగాలంటే పూర్తిస్థాయిలో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలని బలవంతం చేశారు. నెల్లూరులోని ఓ లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నారు. బీఫార్మసీ చేసిన మస్తాన్ బాబు తానే శస్త్రచికిత్స చేస్తానని చెప్పాడు. 23వ తేదీ ఆపరేషన్ చేసే క్రమంలో శ్రీకాంత్ మర్మాంగాలను తొలగించడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఒక్కసారిగా బీపీ డౌన్(BP Down) కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 24న శ్రీకాంత్ అక్క బొడ్డు పల్లవి పోలీసులకిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చిన్నబజారుకు చెందిన పోలీసులు పలుకోణాల్లో విచారించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
లాడ్జ్ లో ఆపరేషన్
లింగమార్పిడి ఆపరేషన్ వికటించి యువకుడు చనిపోయిన ఘటన నెల్లూరు(Nellore)లో సంచలనంగా మారింది. అందులోనూ ఆపరేషన్ చేసేందుకు వారంతా ఓ లాడ్జ్ గదిని అద్దెకు తీసుకోవడం, తెలిసీ తెలియక మత్తుమందు ఇచ్చి మర్మావయాలు తొలగించడం నిండు ప్రాణాన్ని బలికొన్నారు. మిడిమిడి జ్ఞానంతో ఎవరూ ఇలా చేయొద్దని నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి అన్నారు.