Nellore News: నెల్లూరు జిల్లా (Nellore District) వెంకట గిరిలో (Venkatagiri) ఘోరం జరిగింది. ఇంటర్ విద్యార్థిని జ్యోతి అనే యువతిపై ఓ యువకుడు దాడికి తెగబడ్డాడు. ప్రేమ పేరుతో ఆమెను కొంతకాలంగా చెంచు కృష్ణ అనే యువకుడు వేధిస్తున్నట్టు తెలుస్తోంది. అతడి ప్రేమను ఆమె నిరాకరించడంతో ఆమె ఇంటికి వెళ్లి దారుణానికి తెగబడ్డాడు. ఈ రోజు (మార్చి 21) ఉదయం యువతి కాలేజీకి బయలుదేరాల్సి ఉండగా.. ఆమె ఇంట్లోకి చొరబడ్డ చెంచు కృష్ణ కత్తితో ఆమె గొంతు కోశాడు. యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
చాలా కాలంగా వేధింపులు
వెంకట గిరి పట్టణంలోని కాలేజీమిట్టకు చెందిన 18 ఏళ్ల ఓ యువతిని గత కొంత కాలంగా తనను ప్రేమించాలంటూ చెంచు కృష్ణ అనే యువకుడు వేధిస్తున్నాడు. తన ప్రేమను ఒప్పుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు యువకుడిని గతంలో చాలా సార్లు మందలించారు. అయితే, అతను మారలేదు. ఈ రోజు ఇంట్లో నిద్రిస్తున్న యువతిని చూసి నేరుగా ఇంటిలోకి జొరబడి చాకుతో గొంతు కోశాడు. గొంతు కోసి నింపాదిగా వెళ్లి కల్లు తాగి తన ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.
అనంతరం యువతి గొంతు కోసినది చెంచు కృష్ణ అని తెలుసుకున్న స్థానికులు తలుపులు పగులకొట్టి చెంచు కృష్ణను పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం చెంచు కృష్ణ పోలీసులు అదుపులో ఉన్నాడు. తీవ్రంగా గాయపడ్డ యువతిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు చికిత్స అందించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.