KA Paul on Chandrababu : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు బుధవారం నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు, నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై కందుకూరు పోలీస్ స్టేషన్‌లో కేఏ పాల్ చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. ఇరుకు సందులో చంద్రబాబు సభ పెట్టారని కేఏ పాల్ ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు కందుకూరులో సభలో పాల్గొన్నారు.   బుధవారం సాయంత్రం కందుకూరులో ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద నిర్వహించిన సభకు వేలాదిగా జనం హాజరయ్యారు. ఈ సభలో తొక్కిసలాట జరిగి ఒకరిమీద మరొకరు పడటంతో కిందనున్న వారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో భయాందోళనతో కొందరు పరుగులు తీశారు. ఈ తొక్కిసలాటలో కొందరు కాలువలో పడినపోయారు. వారిపై మరికొందరు పడడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 


అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు 


 తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ర్యాలీ సందర్భంగా కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిచ్చయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. కందుకూరు పోలీస్ స్టేషన్ లో 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. 


ఇరుకు రోడ్డులో సభ 


కందుకూరులో చంద్రబాబు రోడ్‌షోలో తొక్కిసలాటపై నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు విచారం వ్యక్తం చేశారు. కందుకూరు ఘటన దురదృష్టకరమన్నారు. ఎన్టీఆర్ సర్కిల్‌లో చంద్రబాబు సభ ఏర్పాటు చేసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ లో అయితే తొక్కిసలాట జరిగే ఆస్కారంలేదన్నారు. అనుమతి ఇచ్చిన ప్రాంతాన్ని దాటి ఇరుకుగా ఉన్న రోడ్డు వైపు చంద్రబాబు వెళ్లారన్నారు. 46 మీటర్లు ముందుకు చంద్రబాబు వాహనం వెళ్లడంతో ఆసమయంలో జనం ఒక్కసారిగా ఇరుకుగా ఉన్న చోటికి చేరటంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన పిచ్చయ్య ఇచ్చిన ఫిర్మాదుతో కేసు నమోదు చేశామన్నారు. పూర్తి స్థాయిలో విచారించి పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేస్తామని ఎస్పీ విజయరావు తెలిపారు.


బాధిత కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ 


నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు   పరామర్శించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ... మృతుల కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల పిల్లలను చదివించే బాధ్యత టీడీపీది అని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు పార్టీ, టీడీపీ నేతల తరపున రూ.24లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. ఇరుకు రోడ్లలో సభలు పెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఇన్నేళ్లలో ఎన్నో సభలు పెట్టామని చెప్పుకొచ్చారు. అన్ని పార్టీలు సభలు పెట్టే చోటే తాము పెట్టామన్నారు. తమపై విమర్శలు చేసినవారి విజ్ఞతకే అన్నీ వదిలిపెడుతున్నా అని చంద్రబాబు పేర్కొన్నారు. కందుకూరు  ప్రమాద మృతుల కుటుంబాలకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆర్థిక సాయం ప్రకటించారు. టీడీపీ నుంచి, పార్టీ నేతల నుంచి ఒక్కొక్క కుటుంబానికి రూ.24 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.