నెల్లూరు నగరంలో జంట హత్యలు కలకలం రేపాయి. స్థానికంగా హోటల్ నిర్వహించే వాసిరెడ్డి కృష్ణారావు, అతని భార్య సునీత తెల్లవారే సరికి రక్తపు మడుగులో పడి మృతి చెందారు. ఇంట్లో బంగారం అక్కడే ఉంది. కేవలం నగదు పోయిందని ఆయన కుమారుడు పోలీసులకు తెలిపాడు. 25 సంవత్సరాల క్రితం వీరు నెల్లూరు నగరానికి వచ్చి స్థిరపడ్డారని తెలుస్తోంది. నెల్లూరు నగరంలోని అశోక్ నగర్ లో సొంత ఇంటిలో వీరు నివసిస్తున్నారు. కరెంట్ ఆఫీస్ సెంటర్ లో శ్రీరామా క్యాంటీన్ నడుపుతుంటారు. హత్య జరిగిన ప్రదేశంలో కత్తి, కర్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ మొదలు పెట్టారు. 


దొంగలు చేసిన పనేనా..?
అది మరీ నిర్మానుష్య ప్రాంతం కాదు, అలాగని ఎప్పుడూ జనసంచారం ఉండే రద్దీ ఏరియా కూడా కాదు. పడారుపల్లి అశోక్ నగర్ లో భార్యా భర్తలు మాత్రమే ఉంటున్నారు. ఉదయాన్నే హోటల్ కి వచ్చే భార్యా భర్తలు, ఎంతకీ రాకపోయే సరికి హోటల్ లో పనిచేసేవారు ఫోన్ చేశారు. ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చింది. ఇంతలో పాలు పోసే మహిళ ఇంటికి రాగా.. గేటు దగ్గరే కృష్ణారావు విగతజీవిగా పడి ఉన్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన్ను చూసి భయపడిపోయిన కృష్ణారావు సోదరుడు సుధాకర్ రావుకి సమాచారమిచ్చారు. సుధాకర్ రావు పోలీసులకు ఫోన్ చేయడంతో.. నెల్లూరు ఫిఫ్త్ టౌన్ సీఐ నరసింహారావు బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది.


ఇంటి బయట కృష్ణారావు విగత జీవిగా ఉన్నాడు. ఇంటి లోపలికి వెళ్లి చూడగా అక్కడ బెడ్ రూమ్ లో ఆయన భార్య సునీత చనిపోయి ఉంది. వెంటనే కృష్ణారావు పెద్ద కుమారుడు సాయిచంద్, చిన్న కుమారుడు గోపీచంద్ కి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సాయిచంద్ విశాఖపట్నంలో పోస్టల్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నారు. గోపీచంద్ నెల్లూరులోనే ఉంటున్నారు. గోపీచంద్, అతని భార్య ఇద్దరూ అశోక్ నగర్ వచ్చారు. ఇంటిలో నగదు పోయిందని కొడుకు గోపీచంద్ చెబుతున్నాడు. క్యాంటీన్ లో వచ్చే డైలీ కలెక్షన్ ఇంటికి తెచ్చి పెడుతుంటారని, ఆ నగదు కనిపించడంలేదని చెబుతున్నాడు కొడుకు గోపీచంద్.


అయితే ఇంట్లో ఉన్న బంగారు నగలు మాత్రం అక్కడే ఉన్నాయి. ఒకవేళ దుండగులు అన్ని రూమ్ లు వెతకలేదా, అలోగా కృష్ణారావు రావడంతో బయటకొచ్చారా అనేది విచారణలో తేలుతుందని చెబుతున్నారు పోలీసులు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. 


కృష్ణా జిల్లా నుంచి వచ్చి..
కృష్ణాజిల్లా వత్సవాయి మండలం, ఇందుగుపల్లి గ్రామం నుంచి కృష్ణారావు కుటుంబం పాతికేళ్ల క్రితం నెల్లూరుకు వలస వచ్చింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉంటున్నారు. సొంత ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడే వ్యాపారం బాగుండటంతో స్థిరపడిపోయారు. తీరా ఇద్దరూ ఇక్కడే హత్యకు గురికావడం విశేషం.