ఒకరు డిగ్రీ, ఇంకొకరు, ఇంజినీరింగ్.. ఇద్దరూ చెడు వ్యసనాలకు బానిసయ్యారు. చదువు డిస్ కంటిన్యూ చేసినా ఇంట్లో మాత్రం కాలేజీలకు వెళ్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. బయటకొచ్చి సోదాగా తిరుగుతారు. అయితే ఇటీవల వీరు గంజాయి బిజినెస్ కూడా మొదలు పెట్టారు. వీరి వ్యవహారాలపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. పారిపోయిన మరో వ్యక్తికోసం గాలిస్తున్నారు.
గంజాయికి బానిసై చివరకు వ్యాపారం
నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఇద్దరు యువకులు గంజాయి వ్యాపారం చేస్తున్నట్టు తమకు సమాచారం రావడంతో తాము వాహనాలు తనిఖీ చేపట్టామని, కావలి పట్టణంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరి బ్యాగుల్లో గంజాయి ప్యాకెట్లు లభించాయని తెలిపారు సీఐ సుధాకర్ రెడ్డి. వీరిని గంజాయి తీసుకు రావాలని చెప్పిన వ్యక్తికోసం గాలిస్తున్నట్టు తెలిపారు. కావలిలో ఇటీవల గంజాయి సరఫరా ఎక్కువగా ఉందని పోలీసులకు సమాచారం అందింది. ముఖ్యంగా స్టూడెంట్స్ గంజాయి తీసుకుంటున్నారని తెలిసింది. అయితే ఇక్కడ స్టూడెంట్సే వ్యాపారులుగా అవతారమెత్తారు. గంజాయికి బానిసలైన వారు తాము తీసుకోవడంతోపాటు, వ్యాపారం చేస్తే మరింత లాభాలు వస్తాయని ఆశపడ్డారు. విశాఖ పట్నం వెళ్లి పాడేరు వద్ద గంజాయిని కొనేవారు. దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లలో బ్యాగుల్లో పెట్టుకుని వచ్చేవారు. కావలిలోనే ఆప్యాకెట్లను విభజించి చిన్న చిన్న పొట్లాలు కట్టి అమ్మేస్తున్నారు. ఇలా అమ్మే క్రమంలో పోలీసులకు చిక్కారు.
తల్లిదండ్రులకు సూచన
తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా పెట్టాలని సూచిస్తున్నారు పోలీసులు. విద్యార్థి దశలో చెడు వ్యసనాలకు బానిసలైతే తర్వాత జీవితం అంధకారమవుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు రిమాండ్ కి తరలించారు. గతంలో నెల్లూరు జిల్లాలో ఎప్పుడు గంజాయి పట్టుబడినా అది ఇక్కడినుంచి రవాణా అవుతుండగా పోలీసులు స్వాధీనం చేసుకునేవారు. నెల్లూరు జిల్లాలో వివిధ చెక్ పోస్ట్ ల వద్ద గంజాయిని స్వాధీనం చేసుకునేవారు. విజయవాడనుంచి, లేదా వైజాగ్ నుంచి నెల్లూరు మీదుగా చిత్తూరు, తిరుపతి, చెన్నైకి తరలించే క్రమంలో ఇక్కడ గంజాయి దొరికేది. కానీ ఇప్పుడు ఏకంగా గంజాయి వినియోగం ఇక్కడ జరుగుతుందని తేలింది. దీంతో పోలీసులు ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి పెట్టారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఇంట్లో గంజాయి
ఇటీవల నెల్లూరులో ఏకంగా గంజాయి మొక్కల్నే పెంచారు. ఇంటిలో ఏపుగా పెరిగిన గంజాయి మొక్కల్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, ఆ ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో విరివిగా గంజాయి అక్రమ రవాణా కేసులు నమోదయినా ఇటీవల అవి తగ్గుముఖం పట్టాయి. ఇంతలో కావలి రాకెట్ బయటపడింది. కావలిలో గంజాయి రవాణాతోపాటు, వినియోగం కూడా ఉందని తేలడంతో కలకలం రేగింది. పోలీసులు ఈ సమాచారంతో అప్రమత్తమయ్యారు. నిఘా పెంచారు. పక్కా ఇన్ఫర్మేషన్ తో వాహనాలు తనిఖీ చేస్తున్నట్టుగా పోలీసులు ఆ ఇద్దరు అనుమానితుల్ని అడ్డుకున్నారు. అయితే తమ వద్ద గంజాయి ఉందని పోలీసులకు తెలుసన్న విషయం నిందితులకు తెలియదు. సాధారణ చెకింగ్ లే అనుకుంటూ వారు పోలీసుల ముందు వాహనం ఆపారు. చివరకు గంజాయితో సహా వారికి చిక్కారు.