Somireddy House Arrest : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉదయగిరి నారాయణ అనే వ్యక్తి ఆత్మహత్యకు ఎస్సై కరిముల్లా కారణమని, ఆయనను అరెస్ట్ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. ఎస్సై అరెస్టుకు డిమాండ్ చేస్తూ చలో నెల్లూరు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అయితే పోలీసులు టీడీపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. చలో నెల్లూరు కార్యక్రమానికి బయలుదేరిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిను అల్లీపురంలోని ఆయన ఇంటి వద్దే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఆయన తన ఇంటి ఆవరణలోనే బైఠాయించి నిరసన తెలిపారు. ఎస్సై కరిముల్లాను వదిలిపెట్టే ప్రసక్తేలేదని, ఆయనతో జైలు ఊచలు లెక్కపెట్టించి తీరుతామని శపథం చేశారు.
సోమిరెడ్డితోపాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటివద్దే కూర్చుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికే పది కేసుల్లో ఎస్సై కరిముల్లా ముద్దాయి అని, అకారణంగా ఆయన ఉదయగిరి నారాయణ ఆత్మహత్యకు కారణం అయ్యారని ఆరోపించారు సోమిరెడ్డి. ఎస్సై కరిముల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అండ ఉందని ఆరోపించారు. ఆయన అండతోనే కరిముల్లా చెలరేగిపోతున్నారని అన్నారు. అలా చెలరేగిపోతూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నాడని మండిపడ్డారు.
పోలీసు తీరుపై మండిపాటు
ఎందరో అమాయక కుటుంబాల ఉసురుపోసుకుంటున్న ఎస్సైపై చర్యలు తీసుకునే దమ్ములేక ఎస్పీ విజయరావు ఎస్సైని వెనకేసుకురావడం దురదృష్టకరం అని అన్నారు సోమిరెడ్డి. తెలుగుదేశం కార్యకర్తలపై పోలీసులు ఒక్క చేయివేస్తే తమ వైపు నుంచి లక్షల చేతులు లేస్తాయని గుర్తుంచుకోవాలని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసుల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని అన్నారు సోమిరెడ్డి. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరిని కొట్టమంటే వారిని కొట్టడం, ఎవరిని హింసించమంటే వారిని హింసించడమే పనిగా కొందరు పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే వారి చావులకు కారణమవుతున్నారని, రక్షకులే భక్షకులుగా మారడం బాధాకరం అని అన్నారు.
టీడీపీ నేతలపై కేసులు
పొదలకూరు ఎస్సై కరిముల్లా ఒక అధికారిగా కాక కాకాణి గోవర్ధన్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా వ్యవహరిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు సోమిరెడ్డి. ఉదయగిరి నారాయణ తన కుటుంబాన్ని దిక్కులేనిదిగా చేసి వెళ్లిపోవడానికి కారణం కరిముల్లానే అని అన్నారు. నారాయణ భార్యతో తన భర్త చావుకు ఎవరూ కారణం కాదని బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్నారని, ఇప్పుడామె నిజం చెబుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని చెప్పారు. తెలుగుదేశం పోరాటం వల్లే, నారాయణపై ఫిర్యాదు చేసిన వంశీనాయుడుపై కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. అయితే నారాయణను దారుణంగా కొట్టి చంపిన ఎస్సై కరిముల్లా పేరును మాత్రం కేసులో లేకుండా చేసేశారని చెప్పారు.
ఎస్సై ఆగడాలు!
ఇలాంటి అరాచకాలు, దారుణాలు ఎస్సై కరిముల్లాకు కొత్తేమి కాదని అన్నారు సోమిరెడ్డి. గతంలో వెంకటాచలం ఎస్సైగా పనిచేసిన సమయంలో కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోడానికి కరిముల్లా కారణం అయ్యారని చెప్పారు. పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన రైతు విషయంలో కూడా కరిముల్లా ఇలానే ప్రవర్తించాడని చెప్పారు. ఇప్పటికే పది కేసుల్లో ఎస్సై కరిముల్లా ముద్దాయిగా ఉన్నారని, మంత్రి కాకాణి అండతో చెలరేగిపోతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రులను కాదని ఎలాంటి చర్యలు తీసుకోలేక కలెక్టర్, ఎస్పీలు డమ్మీలుగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు సోమిరెడ్డి. ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు జిల్లాలో ఫ్యాక్షన్ ప్రాంతాల కంటే దారుణమైన పరిస్థితులు నెలకొనడం బాధాకరం అని చెప్పారు.