Nellore News : నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఇంటి ఓనర్ ను హత్య చేశాడో వ్యక్తి. ఇంట్లో అద్దెకు ఉంటున్న రాజశేఖర్ అనే వ్యక్తి ఓబులేసును హత్య చేశాడు. రాజశేఖర్ మద్యం సేవించి ఇంటికి వచ్చి పెద్దగా కేకలు వేయడంతో అలా ఎందుకు అరుస్తున్నావని ఇంటి ఓనర్ ప్రశ్నించాడు. దీంతో రాజశేఖర్ అతనితో ఘర్షణకు దిగి దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. ఐదు నెలల క్రితం ఓబులేసు ఇంట్లో రాజశేఖర్ అద్దెకు దిగినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ వేధింపులు తాళలేక అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మద్యానికి బానిసైన రాజశేఖర్ రోజు తాగి పెద్దగా అరుస్తుండడంతో ఇంటి యజమాని ఓబులేసు అడిగినందుకు అతడిపై దాడిచేసి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న కుటుంబ సభ్యులు, ఒకరు మృతి
ఆస్తి పంపకాలలో తేడా రావడంతో సొంత అన్నదమ్ములు ఇటుకలు, కర్రలతో దాడి చేసుకున్న సంఘటన హైదరాబాద్ మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ దాడిలో అబ్దుల్లా అనే వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శమ్మ కాలనీలో నివాసం ఉంటున్న మసూద్ అనే వ్యక్తికి అబ్దుల్లా, మహమ్మద్, ముణిర్, జహూర్, ఫసి, మోహిన్ అనే ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా తండ్రి కుమారుల మధ్య ఆస్తి పంపకాల వివాదాలు కొనసాగుతున్నడంతో మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా గురువారం రోజు తిరిగి ఆస్తి పంపకాల విషయమై తండ్రికి కుమారులకు వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఒకరిపై ఒకరు కర్రలు ఇటుకలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ప్రమాదంలో జహుర్, అబ్దుల్లాకు తీవ్ర గాయాలయ్యాయి. గొడవ జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లే వరకు పోలీసుల ముందే ఒకరిపై ఒకరు విచక్షణ రహితంగా దాడి చేసుకున్నారు. వీరిలో తీవ్ర గాయాల పాలైన అబ్దుల్లా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మైలర్ దేవ్ పల్లి పోలీసులు అబ్దుల్లా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల భయంతో పారిపోతూ గుండెపోటుతో వ్యక్తి మృతి
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని పెద్ద చెరువు సమీపంలో పేకాట శిబిరం నుంచి పరుగులు తీస్తున్న చికెన్ వ్యాపారి షేక్ అబ్బాస్(37) గుండెపోటుతో మృతి చెందాడు. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులను చూసి పేకాటరాయుళ్లు పరుగులు తీశారు. షేక్ అబ్బాస్ కుడా వారితోపాటు పరుగెడుతూ గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కూలిపోయాడు. అతడిని పోలీసులు జీపులో నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు గురువారం రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు దాడి చేయడంతోనే అబ్బాస్ మృతి చెందినట్లు బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.