నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం ఫీజులకోసం పిల్లల్ని గదిలో బంధించడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం తల్లిదండ్రులకు తెలియడంతో వారంతా హుటాహుటిన స్కూల్ వద్దకు చేరుకున్నారు. టీచర్స్ ని నిలదీశారు. బ్యాలెన్స్ ఫీజులకోసం పిల్లల్ని లైన్లో నిలబెట్టి వారి వద్ద ఫోన్ నెంబర్లు మాత్రమే తీసుకున్నామని, ఫీజు కోసం డిమాండ్ చేయలేదని టీచర్లు చెబుతున్నా.. తల్లిదండ్రులు మాత్రం యాజమాన్యం దారుణంగా వ్యవహరించిందంటూ మండిపడుతున్నారు. మరోవైపు అభం శుభం తెలియని పిల్లలు కూడా తమని గదిలో బంధించాలంటూ వాపోయారు. మొత్తం 12మంది పిల్లల్ని తరగతి గదిలో బంధించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు తల్లిదండ్రులు. 


రూమ్ లో బంధించి


ఉదయాన్నే స్కూల్ కి వెళ్లిన పిల్లల్లో ఫీజు కట్టనివారందర్నీ ఓ రూమ్ లోకి పిలిపించారు. వారందరి వద్ద వివరాలు సేకరిస్తున్నారు. తల్లిదండ్రుల ఫోన్లు అందుబాటులో లేకపోతే ఆల్టర్నేట్ నెంబర్లు వారి వద్దనుంచి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమందిని గదిలో నిర్బంధించినట్టు తెలుస్తోంది. విద్యార్థులు గదిలో ఉండలేక ఇబ్బంది పడ్డారు. ఇక ఫోన్ నెబర్లు తీసుకుంటున్న టీచర్లు ఒక్కొక్కరికి ఫోన్లు చేస్తూ ఫీజు విషయమై అడుగుతున్నారు. ఇటీవల పర్మిషన్ అడిగిన కొంతమంది పేరెంట్స్.. మళ్లీ ఎందుకు సడన్ గా ఫోన్ చేశారంటూ స్కూల్ కి వచ్చారు. దీంతో అసలు విషయం బయటపడింది. కొంతమంది పిల్లల్ని నిర్బంధించి ఉండటం చూసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 




స్కూల్ టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ మాత్రం తమకేం తెలియదని బుకాయిస్తున్నారు. పిల్లలను పక్క రూమ్ కి పంపించిన విషయం క్లియర్ గా తెలుస్తున్నా.. తాము ఫీజుకోసం పిలిపించలేదని, కేవలం ఫోన్ నెంబర్లు మాత్రమే తీసుకుంటున్నామని చెబుతున్నారు ఉపాధ్యాయులు. 


పేరెంట్స్ కమిటీ ఆగ్రహం.. 
ఈ విషయం తెలుసుకున్న జిల్లా పేరెంట్స్ కమిటీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయకుండా ఫీజులు చెల్లించలేదని నెపంతో విద్యార్థుల్ని అమానుషంగా వేధింపులకు గురిచేసిన శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని పాఠశాల యాజమాన్యం, అమానుషంగా ప్రవర్తించారని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ, పాఠశాల నిర్వహణ సంబంధించి స్పష్టంగా జీవోల్లో వివరణ ఉందని, ప్రభుత్వ జీవోలను పక్కనపెట్టి, ఇష్టానుసారం ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నారు.