మద్య నిషేధం చేస్తామని ప్రకటనలు చేస్తారు నేతలు. కానీ వాటి నుంచి ఆదాయం పెంచే చర్యలు తీసుకుంటున్నారే తప్ప నిషేధం చేసే పరిస్థితులు కనిపించడం లేదు. మద్యం మత్తులో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయని అధికారులు, పోలీసులు పలు కేసుల విచారణలో భాగంగా వెల్లడించడం చూస్తుంటాం. తాజాగా అలాంటి దారుణం నెల్లూరు జిల్లాలో జరిగింది. ఓ వ్యక్తి సమీప బంధువుపై అత్యాచారం చేయబోయాడు. ఆమె తప్పించుకునే క్రమంలో రొయ్యల చెరువులో పడి మృతి చెందింది. ఈ ఘటన జిల్లాలోని ముత్తుకూరు మండలం పోలంరాజు గుంట పంచాయతీలో జరిగింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 


మద్యం మత్తులో దారుణాలు 
మద్యం మత్తులో జరుగుతున్న దారుణాలకు ఇది మరో ఉదాహరణ. ఇటీవలే నెల్లూరు జిల్లాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి తన మేనకోడలిపై యాసిడ్ దాడి చేశాడు. ఆ దాడిలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆ బాధితురాలు జీవచ్ఛవంగా బతుకుతోంది. నిందితుడు జైలులో ఉన్నాడు. ఇద్దరూ బంధువులే. కానీ మద్యం మత్తు, క్షణికావేశం.. ఇలా ఆ రెండు కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. తాజాగా అలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో జరిగింది. 


సైదాపురం మండలం చాగణం గ్రామానికి చెందిన రాజా దంపతులు ముత్తుకూరు మండలం పోలంరాజుగుంటలోని ప్రసాద్‌ రెడ్డి అనే వ్యక్తి వద్ద పనికి కుదిరారు. ఆయన రొయ్యల గుంటల వద్ద కాపలాగా ఉండేవారు. దసరా సందర్భంగా ఆ దంపతుల ద్గగరి బంధువు బండిమణి కూడా వారు కాపలాగా ఉన్న రొయ్యల గుంటల వద్దకు వచ్చాడు. దసరా సందర్భంగా వారు మద్యం తాగారు. అయితే మణి ఆ తర్వాత రాజా భార్యను లొంగదీసుకోవాలనుకున్నాడు. రొయ్యల గుంటల వద్ద వారే కాపలాగా ఉంటారు, వేరే వ్యక్తులు అక్కడ ఉండకపోవడంతో అత్యాచారం చేయాలని చూశాడు. కానీ రాజా భార్య తప్పించుకున్నా పెను విషాదం జరిగింది. అత్యాచారం జరగకుండా తప్పించుకునే క్రమంలో ఆమె అదుపుతప్పి రొయ్యల గుంటలో పడినట్టు తెలుస్తోంది. రొయ్యల గుంటలో పడిన రాజా భార్య తిరిగి పైకి రాలేకపోయింది. నీరు ఎక్కువగా ఉండటం, రాత్రివేళ కావడం, కాపాడాల్సిన వారు మద్యం మత్తులో ఉండటంతో ఘోరం జరిగిపోయింది. రాజా భార్య రొయ్యల గుంటలో పడి మృతి చెందింది. 


రొయ్యల గుంట యజమాని ప్రసాద్ రెడ్డి తెల్లవారుజామున అక్కడికి వచ్చాడు. అప్పటికే శవాన్ని వెలికి తీసిన రాజా.. తన భార్య మృతి చెందిందని యజమానికి తెలిపాడు. ఈ క్రమంలో ప్రసాద్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బండి మణిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకేసు నమోదు చేశారు. 


స్నేహితులను సైతం హత్య చేసిన ఘటనలు 
ఇటీవల కాలంలో మద్యం మత్తులో జరుగుతున్న దారుణాలు నెల్లూరు జిల్లాలో ఎక్కువగా నమోదవుతున్నాయి. మద్యం మత్తులో స్నేహితులనే కొంతమంది చంపివేశారు. మద్యం మత్తులో కుటుంబ సభ్యులపైనే దాడికి దిగుతున్నారు. తాజాగా ముత్తుకూరు మండలంలో జరిగిన ఘటన కూడా ఇలాంటిదే. దసరా సందర్భంగా మద్యం తాగిన తర్వాత సమీప బంధువుపైనే బండి మణి అత్యాచారం చేయబోయాడు. ఆమె తప్పించుకునే క్రమంలో రొయ్యలగుంటలో పడి చనిపోయింది. ఈ ఘటనతో  రొయ్యల గుంటల వద్ద కాపలాకి వచ్చేవారంతా ఉలిక్కి పడ్డారు. రాత్రివేళ భార్యా భర్తలే రొయ్యల గుంటల వద్ద కాపలాగా ఉంటారు. ఎవరైనా అక్కడికి వస్తే, ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే పలకరించేవారు కూడా ఉండరు, సాయం వచ్చేవారు అసలు ఉండరు. ఈ క్రమంలో రాజా భార్య చనిపోయిన తీరు మరింత భయాందోళనలకు దారి తీస్తోంది.