నెల్లూరు నగరంలో నెలన్నర కాల వ్యవధిలో రెండుసార్లు కుళ్లిన చికెన్ ని పట్టుకున్నారు హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు. సరిగ్గా ఇప్పుడు క్రిస్మస్ ముందురోజు 500 కేజీల కుళ్లిన చికెన్ ని పట్టుకున్నారు. నెలరోజులకి పైగా నిల్వ ఉన్న చికెన్ కావడంతో పురుగులు పట్టి ఉంది. చుట్టుపక్కల వారు ఇక్కడ కుళ్లిన వాసన రావడంతో అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో హెల్త్ డిపార్ట్ మెంట్ సిబ్బంది దాడులు చేసి కుళ్లిన చికెన్ ని బయటకు తీశారు. షాపు నిర్వాహకులపై కేసులు పెట్టారు, భారీ పెనాల్టీ విధించారు. కుళ్లిన చికెన్ తింటే తీవ్ర అనారోగ్యంపాలయ్యే అవకాశముందని, చిన్న పిల్లలు, గర్భిణులు దీన్ని తినడం వల్ల మరింత ప్రమాదం అని చెబుతున్నారు. తమిళనాడునుంచి ఈ చికెన్ నిల్వలను తెచ్చి పెట్టారని తెలుస్తోంది.


కుళ్లిన చికెన్ దందా 
నెల్లూరులో కుళ్లిన చికెన్ దందా చాన్నాళ్లుగా నడుస్తోంది. అయితే ఇటీవల నెలన్నర వ్యవధిలో రెండుసార్లు కుళ్లిన చికెన్ వ్యవహారం గుట్టు రట్టు చేశారు అధికారులు. గత నెలలో నెల్లూరు నగరంలో దాదాపు వెయ్యి కిలోల కుళ్లిన చికెన్ ని స్వాధీనం చేసుకుని చెత్త కుప్పల్లో పారేశారు. ఆ తర్వాత వెంకటేశ్వర పురంలో ఓ చికెన్ షాపులో నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసినా పరిస్థితిలో ఏ మార్పు లేదు. తాజాగా మరోసారి 500 కేజీలకు పైగా కుళ్లిన చికెన్ ని అధికారులు సీజ్ చేశారు.


తమిళనాడు నుంచి కుళ్లిన చికెన్ సరఫరా అవుతున్నట్టు తెలుస్తోంది. తక్కువ రేటుకి వచ్చే ఈ చికెన్ ని తీసుకొచ్చి, నెల్లూరులోని కొన్ని ప్రాంతాల్లో ఫ్రిజ్ లలో నిల్వ చేస్తారు. దాదాపు నెలరోజులపాటు ఈ చికెన్ నిల్వ ఉంటుంది. అప్పటికే పురుగులు పట్టి ఉన్నా, వేడి వేడిగా కూరచేసి వడ్డించేస్తారు కనుక పెద్దగా ఎవరికీ అనుమానం రాదు, కానీ ఆరోగ్యం మాత్రం పాడవుతుంది. ఇక బిర్యానీలో ఇలాంటి చికెన్ వాడితే మసాలాల ప్రభావంతో మంచి చికెన్ అని తినాల్సి వస్తుంది. ఏమాత్రం అనుమానం రాకుండా వండి వడ్డించేస్తారు. ఇలాంటి చికెన్ వల్ల చాలా అనర్థాలున్నాయని అంటున్నారు అధికారులు.




ప్రజలు గమనించాలి..


చికెన్ తో వంట చేసుకోవాలనుకుంటే నేరుగా షాపుకి వెళ్లి చికెన్ తీసుకొచ్చుకోవాలని, ఆ తర్వాత ఇంటిలో కూర చేసుకోవాలని సూచిస్తున్నారు. బయట రోడ్ సైడ్ బండ్ల వద్ద, లేదా చిన్న చిన్న షాపుల్లో దొరికే బిర్యానీలు, ఇతర చికెన్ కర్రీల వల్ల అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. పదే పదే ఇలాంటి వ్యవహారం బయటపడుతున్నా, చికెన్ ప్రియులు బయట తినకుండా ఉండలేరు, వారి బలహీనతని అడ్డుపెట్టుకుని కొంతమంది దుర్మార్గులు ఇలాంటి బిజినెస్ చేయకుండా ఉండలేరు. తక్కువరేటుకే చికెన్ బిర్యానీ అంటూ చాలామంది బోర్డులు పెట్టి అమ్మేస్తుంటారు. అలాంటి వారితో కాస్త జాగ్రత్త అని చెబుతున్నారు హెల్త్ అధికారులు.




ప్రస్తుతం క్రిస్మస్ సీజన్ కి ముందుగా కుళ్లిన చికెన్ దందా బయటపడింది. క్రిస్మస్ కోసం ఈ చికెన్ నిల్వ చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత న్యూ ఇయర్  సెలబ్రేషన్స్ కోసం కూడా భారీగా బిర్యానీల ఆర్డర్లు ఉంటాయి. అప్పుడు కూడా ఇలాంటి చికెన్ ఈజీగా సేలవుతుంది. అందుకే ఈ సీజన్ ని క్యాష్ చేసుకోడానికి భారీగా కుళ్లిన చికెన్ ని తక్కువ రేటుకి తెచ్చి నిల్వ ఉంచారని అధికారులు భావిస్తున్నారు.