Nellore Crime: ఓవైపు ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Womens Day) ఘనంగా జరుగుతోంది. ఏపీలో కూడా నాయకులు, అధికారులు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించారు. వారి గురించి గొప్పగా చెబుతున్నారు. ఇదే రోజున నెల్లూరు(Nellore) జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సైదాపురం మండలం రాపూరు అటవీ ప్రాంతంలో యూరప్(Europe) లోని లిథువేనియా దేశస్థురాలని పోలీసులు గుర్తించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసేందుకు అటవీ ప్రాంతానికి తీసుకొచ్చారని తెలుస్తోంది. స్థానికులు గమనించే సరికి ఆమెను అక్కడే వదిలేసి కారులో పారిపోయినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె జిల్లా పోలీసుల రక్షణలో ఉంది. నిందితుల కోసం గాలిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ఘటన జరగడం, అందులోనూ బాధితురాలు విదేశీ యువతి కావడంతో పోలీసులు ఈ వ్యవహారంపై గోప్యత పాటిస్తున్నారు. మహిళ నుంచి పాస్ పోర్ట్(Passport) స్వాధీనం చేసుకుని ఆమెకు రక్షణ కల్పించారు. బాధితురాలు భారత సందర్శనకు వచ్చారని, గోవా(Goa) వెళ్తుండగా మధ్యలో ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు. 


ఇద్దరు అరెస్టు


భారత్ లో విహార యాత్రకు లిథువేనియా నుంచి వచ్చిన  మహిళను నమ్మించి నెల్లూరు జిల్లా సైదాపురం అడవికి తీసుకొని వెళ్లి అత్యాచారం చేయబోయిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందుతుల నుంచి తప్పించుకొని స్థానికుల సహాయంతో పోలీస్ స్టేషన్ లో మహిళ ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన పోలీసులు గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.  నిందితులు  ఇంగిలాల సాయి కుమార్, సయ్యద్ అబిద్ అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.  


లిథువేనియా దేశానికి చెందిన మహిళ భారత దేశ విహార యాత్రకు శ్రీలంక నుంచి గోవాకు వెళ్లే క్రమంలో చెన్నై ఎయిర్ పోర్టులో దిగింది. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లేందుకు బస్ ఎక్కింది. ఇండియన్ కరెన్సీ లేనందున, బస్సు డ్రైవర్ ఆమెను బస్సు నుంచి దింపివేశాడు. ఈ క్రమంలో ఇంగిలాల సాయి కుమార్ ఆమెకు డబ్బులు ఇచ్చి ఆమెను నమ్మించి నెల్లూరు జిల్లా వెంకన్న పాలేనికి తీసుకొని వచ్చాడు. తన స్నేహితుడైన షేక్ అబిర్ తో కలసి ఆమెపై అత్యాచారం చేయాలనుకున్నాడు. బైక్ లో ఎక్కించుకొని సైదాపురం అడవిలోనికి తీసుకొని వెళ్లి అత్యాచారయత్నం చేయబోగా, బాధితురాలు నుంచి తప్పించుకొని సైదాపురం పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు చిల్లకూరు జంక్షన్ వద్ద నిందితుల్ని పట్టుకొన్నారు. 


చిత్తూరులో మరో ఘటన 


 మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చి పోతున్నారు. పసికందుల నుంచి పండు ముసలి వరకూ ఎవరిని వదిలి పెట్టడం‌ లేదు మృగాళ్లు. వయస్సుతో తేడా లేకుండా మహిళలపై దాడులకు దిగుతూ ప్రాణాలను సైతం బలితీసుకుంటున్నారు. మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల ఆగడాలకు అడ్డుకట్టపడడంలేదు. చిత్తూరు జిల్లాలో ఒంటరిగా ఉన్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. మహిళ ప్రతిఘటించడంతో ఆమెను కిరాతకంగా హత్య చేసిన ఘటన మహిళా దినోత్సవం నాడే వెలుగుచూసింది. 


మహిళపై దాడి, ఆపై హత్య 


చిత్తూరు జిల్లా ఎర్రవారిపాళ్యం మండలం ఊటబావులపల్లె గ్రామానికి చెందిన మహిళ తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. రెండు సంవత్సరాల క్రితం ఆమె భర్త బతుకుదెరువు కోసం కోవైట్ కు వెళ్లాడు. దీంతో ఇంటి వద్ద ఖాళీగా లేకుండా రెండు పాడి ఆవులను తీసుకుని వాటిని‌ మేపుకుంటూ పిల్లలను చదివించుకుంటుంది. ఈ క్రమంలో పశువులకు మేత కోసం సోమవారం సాయంత్రం గడ్డిని తీసుకుని‌ వచ్చేందుకు గ్రామానికి సమీపంలోని పొలాల వద్దకు వెళ్లింది. అయితే పశువుల గడ్డి సేకరిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఆ వ్యక్తిపై ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో తమ కోరిక తీర్చలేదని కోపోద్రిక్తుడైన వ్యక్తి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అనసూయ శవాన్ని పొలానికి వంద మీటర్ల దూరంలో ఉన్న ఓ పాడుబడ్డ బావిలో పడ్డేశారు.