Nandyal News : ఒకరికి తెలియకుండా మరొకర్ని ఇలా ముగ్గురిని వివాహం చేసుకుంది ఓ మహిళ. ఆస్తి కోసం పెళ్లిళ్లు చేసుకుంటున్న నిత్య పెళ్లి కూతురు మోసాలు నంద్యాల జిల్లాలో వెలుగుచూశాయి. ఆస్తి తన పేరిట రాయాలని డిమాండ్ చేయడం లేకపోతే విడాకులు ఇస్తానని బెదిరించడం ఆమె ట్రిక్. మహిళపై అనుమానం వచ్చిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 


అసలేం జరిగింది? 


నంద్యాల జిల్లా మిట్నాల గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతి ఒకరికి తెలియకుండా మరొకర్ని ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఆమె విడాకులు ఇవ్వకుండా ముగ్గుర్ని మోసం చేసినట్లు తెలుస్తోంది. బాధితుల్లో ఒకరు పోలీసులను ఆశ్రయించడంతో మహిళ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీనివాసులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం మిట్నాలకు చెందిన మేరీ జసింట అలియాస్‌ మేరమ్మ కుమార్తె శిరీషకు గతంలో అవుకు మండలం చెన్నంపల్లె గ్రామానికి చెందిన మల్లికార్జునతో తొలి వివాహం జరిగింది. మల్లికార్జునతో విడాకులు తీసుకోకుండానే ఆత్మకూరు మండలం కొత్తపల్లెకి చెందిన శ్రీనివాసరెడ్డిని శిరీష రెండో పెళ్లి చేసుకుంది. అతడితో కూడా విడాకులు తీసుకోకుండానే బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్‌ రంగాపురం వాసి మహేశ్వరరెడ్డిని మూడో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. మహేశ్వరరెడ్డికి కూడా రెండో పెళ్లి కావడంతో ఆయన పెళ్లికి ఒప్పుకున్నాడు. అయితే శిరీష్ తనకు రక్షణగా రూ.5 లక్షలు డిపాజిట్‌ చేయాలని కోరింది. రూ.5 లక్షలు డిపాజిట్‌ చేయగా, ఫిబ్రవరి 5న మద్దిలేటిస్వామి ఆలయంలో పెళ్లి అయింది. 


నాలుగో పెళ్లికి సిద్ధం! 


శిరీష తల్లి మేరమ్మ ఆర్‌ఎస్‌ రంగాపురం తరచూ వస్తూ తన కూతురిని అత్తారింట్లో ఉంచాలంటే మరికొంత డబ్బు, ఆస్తి రాసివ్వాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. శిరీష్, ఆమె తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చిన మహేశ్వరరెడ్డి శిరీష గురించి విచారించారు. దీంతో ఆమెకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగినట్లు తెలుసుకొని షాకయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. అయితే ముగ్గురిని మోసం చేసిన శిరీష తాజాగా నాలుగో పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం.


Also Read : Guntur: పెళ్లికి ముందు వరుడి మాజీ లవర్ ఊహించని ట్విస్ట్, అసలు విషయం తెలిసి వధువు ఫ్యామిలీ షాక్


Also Read : Viral News: తాళి కట్టే టైంలో స్పృహ తప్పిన వధువు- తర్వాత ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి పోలీసులు ఎంట్రీ!