Nandyal News: నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం, శ్రీపతిరావు పేటలో విషాదం చోటు చేసుకుంది. నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లిన ఓ 9వ తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు కాలుజారి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీపతిరావుపేటకు చెందిన అహమద్ భాష, అయేషా దంపతుల కుమారుడు కాజా సమీర్.. దసరా సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్ చూసేందుకని వెళ్లాడు. ఇందిరేశ్వరం గ్రామ శివారు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న చిన్నగుండం జలపాతాన్ని చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే కాజా కాలుజారి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కాజా తల్లిదండ్రులు.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అటవీ అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో జలపాతం ఉండటం, అక్కడ క్రూర జంతువులు సంచరిస్తూ ఉండడం వల్ల పర్యాటకులు అక్కడికి వెళ్లకుండా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నిషేధాన్ని కూడా కొనసాగిస్తున్నారు. చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ విద్యార్థులంతా కలిసి అక్కడకు ఎలా వెళ్లారు, ఎవరు అనుమతి ఇచ్చారనే విషయంపై సందిగ్ధం నెలకొంది.
సరదా కోసం వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకున్న విద్యార్థి...!
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలు సెలవులు వస్తే చాలు.. ఈత కొట్టడానికి వెళ్లడం, దగ్గర దగ్గర ఉన్న ప్రాంతాలను చూసేందుకు వెళ్లడం వంటివి చేస్తుంటారు. ఇలాగే ఇద్దరు మిత్రులు కలిసి వాటర్ ఫాల్స్ ని చూడాలనుకుని సమీప ప్రాంతంలో ఉన్న జలపాతం వద్దకు వెళ్లారు. వాటర్ ఫాల్స్ ని చూసి మురిసిపోయిన విద్యార్థులు మాటల ఉత్సాహంలో మునిగితేలారు. ఈ క్రమంలోనే అనుకోకుండా ఓ విద్యార్థి కాలుజారి కింద పడిపోవడంతో... తలకు బలమైన గాయాలు అయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని గ్రామస్థులకు, కుటుంబ సభ్యులకు ఎలా చెప్పాలో తెలియక మరో విద్యార్థి చాలా భయపడిపోయాడు. ఎలాగోలా విషయాన్ని గ్రామస్థులకు తెలిపాడు.
అటవీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఘటన...!
నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులతో పాటు ఎప్పటికప్పుడు పోలీసులు కూడా పహారా కాస్తుంటారు. అడవిలో చాలా నిషేధ ప్రాంతాలు ఉన్నాయి. దట్టమైనటువంటి అడవిలోకి జంతువులు క్రూర మృగాలను సైతం లెక్కచేయకుండా చిన్నగుండం వాటర్ ఫాల్స్ ని చూడడానికి ఇద్దరు విద్యార్థులు ఏ దారిలో వెళ్లారన్నది ఇప్పటికీ అధికారులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. నిజంగా ఆటవి ఆధికారులు, పోలీస్ యంత్రాంగం తమ విధులు నిర్వహిస్తూ ఉంటే ఈ ఘటన ఏ విధంగా జరిగింది అంటూ మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అధికారులపై ఫైర్ అవుతున్నారు.
సెలవుల సమయంలో తల్లిదండ్రుల బాధ్యత...!
సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే అమితమైన ఉల్లాసం ఉత్సాహం. స్నేహితులతో కలిసి ఆడుకోవాలని పిల్లలలో ఉండటం సహజం. అయితే పిల్లలు ఎక్కడకు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారనే దానిపై తల్లిదండ్రులు కూడా ఓ కన్నేయాలి. ఎక్కిడికి వెళ్లినా చెప్పే వెళ్లేలా జాగ్రత్తలు తీస్కోవాలి. పిల్లలు తెలిసీ తెలియని వయసులో తప్పులు చేస్తూ ఉంటారు. అలాంటి తప్పులను తల్లిదండ్రులు బాధ్యతగా ఎప్పటికప్పుడు సరి చేస్తూ ముందుకు తీసుకెళ్లాలి. వారికి ఏం కావాలో గమనిస్తూ అడగకుండానే అందివ్వాలి.