ADE Ambedkar found to have illegal assets worth Rs 200 crore: హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) అంబేడ్కర్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బుధవారం ఉదయం నాంపల్లి ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా విచారణ జరిపిన అనంతరం నిందితుడికి రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆరోపణలతో ఏసీబీ అధికారులు మంగళవారం రోజు అంబేద్కర్ ఇంట్లో, బంధువులు, బినామీల నివాసాలలో తనిఖీలు చేశారు. అక్రమ ఆస్తులు గుర్తించిన తరువాత ఏడీఈ అంబేద్కర్‌ను అరెస్టు చేశారు.
రూ.200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) అంబేద్కర్‌పై ఏసీబీ అధికారులు భారీ దాడులు నిర్వహించారు. మంగళవారం నాడు మణికొండలోని ఆయన నివాసంతో పాటు, గచ్చిబౌలి, మధాపూర్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆయన బంధువులు, బెనామీల ఇళ్లపై మొత్తం 18 బృందాలుగా విభజించి తనిఖీలు చేపట్టారు.
ఈ సోదాల్లో ఏం గుర్తించారంటే:రూ.2 కోట్లకుపైగా నగదు (నోట్ల కట్టల రూపంలో),భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు,మూడు ప్లాట్లు, గచ్చిబౌలిలో ఓ అపార్త్మెంట్ భవనం,10 ఎకరాల వ్యవసాయ భూమి,1,000 చదరపు గజాల ఫామ్‌హౌస్ వంటి విలాసవంతమైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి.
ప్రాథమికంగా ఈ ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉండవచ్చని ఏసీబీ అధికారులు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లోని బినామీ సతీష్ ఇంట్లోనే రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. ఈ మొత్తం ఉద్యోగి అంబేద్కర్ అక్రమ లంచాలతో సంపాదించినదేనని అధికారులు ధృవీకరించారు. తనిఖీల్లో భారీ సంఖ్యలో డాక్యుమెంట్లు, ప్రాపర్టీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. లక్ష రూపాయల జీతం ఉన్న ఉద్యోగికి వందల కోట్ల ఆస్తులు ఉండటంతో అక్రమ ఆస్తులుగా నిర్ధారించారు.
అంబేద్కర్ మణికొండ, నార్సింగ్ డివిజన్లలో ఏడీఈగా పనిచేస్తూ విద్యుత్ కనెక్షన్ల కోసమూ, చిన్న పనులకైనా భారీ లంచాలు వసూలు చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి. షాపింగ్ మాల్స్, థియేటర్లు, వాణిజ్య సంస్థలకు కనెక్షన్లు ఇవ్వాలంటే డబ్బు తప్పనిసరి చేస్తూ, లంచం ఇవ్వని వినియోగదారులను వేధించేవాడని పలు ఫిర్యాదులు వచ్చాయి.
గత ఏడాది ఆయన అవినీతి, డ్యూటీలో లేనివాటిల్లో భాగంగా సస్పెండ్ అయ్యారు. అయితే కొద్దిపాటి వ్యవధిలోనే తిరిగి డ్యూటీకి వచ్చారు. ఈ కేసులో ఏసీబీ అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అక్రమంగా కూడబెట్టిన ఆస్తులపై ఆధారాలతో పాటు అంబేద్కర్‌ను సెప్టెంబర్ 16న అరెస్టు చేసింది. నేడు నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించడంతో పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.