Honor Killing Case in Miryalaguda | నల్గొండ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ1 మారుతీ రావు గతంలో ఆత్మహత్య చేసుకోగా, ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఈ కేసులో మిగతా నిందితులకు జీవిత ఖైదు విధించారు. హార్ట్ పెషేంట్స్ అని, కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగోలేదని, చిన్న పిల్లలు ఉన్నారని.. శిక్ష తగ్గించాలని నేరస్తులు న్యాయమూర్తిని వేడుకున్నారు. కానీ కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి ఏ2కు ఉరిశిక్ష, ఏ3 నుంచి ఏ8 నేరస్తులకు జీవిత ఖైదు శిక్ష వేశారు.

కులాంతర వివాహం చేసుకున్నాడని హత్య

తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో మిర్యాలగూడకు చెందిన మారుతీరావు తన అల్లుడు ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించాడు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీ తరువాత ఈ జంట రీల్స్, సోషల్ మీడియాలో పోస్టులతో మారుతీరావు కుటుంబం మరింత కుంగిపోయింది. అమృతది వైశ్య సామాజికవర్గం కాగా, ప్రణయ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు. దాంతో మిర్యాలగూడకు చెందిన మారుతీరావు అల్లుడు ప్రణయ్‌ ని పరువు హత్యకు ప్లాన్ చేశాడు. సుపారీ ఇచ్చి మరీ అల్లుడు ప్రణయ్ ను పరువుహత్య చేయించడం అప్పట్లో కలకలం రేపింది. దాదాపు 5 ఐదేళ్లకు పైగా విచారణ అనంతరం సోమవారం నాడు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు నిందితులకు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా అప్పటి నల్గొండ ఎస్పీగా ఏవీ రంగనాథ్ ఉన్నారు. ఇన్నేళ్ల తరువాత ప్రణయ్ హత్య కేసులో తీర్పు రావడం సంతోషంగా ఉందన్నారు.

సుపారీ ఇచ్చి మరీ దారుణం..

గర్భంతో ఉన్న అమృత తన భర్త ప్రణయ్, అత్త ప్రేమలతో కలిసి మిర్యాలగూడలోని ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుని, తిరిగి వెళ్తున్నారు. ఓ దుండగుడు వెనుక నుంచి ప్రణయ్ పై కత్తితో అటాక్ చేసి, విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ప్రణయ్ అక్కడే చనిపోయాడు. 2018 సెప్టెంబర్‌ 14న మారుతీ రావు తన అల్లుడు ప్రణయ్‌ను హత్య చేయించాడు. ప్రణయ్ హత్యపై కేసు నమోదు చేసుకున్న మిర్యాలగూడ పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ప్రధాన నిందితుడు కావడంతో ఏ1గా ఉన్నాడు. సుభాష్‌కుమార్‌ శర్మ ఏ2, అస్గర్‌ అలీ ఏ3, బారీ ఏ4, కరీం ఏ5, శ్రవణ్‌కుమార్ ఏ6, శివ ఏ7, నిజాం ఏ8గా ఉన్నారు. పోలీసులు 2019లో ప్రణయ్ హత్యపై ఛార్జిషీటు దాఖలు చేశారు. ఐదేళ్లకు పైగా వాదనలు ముగిశాయి. 302, 120, 109, 1989 సెక్షన్ ipc, ఇండియన్ ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష ఖరారు చేశారు.

2020లో ఏ1 ఆత్మహత్య..

ఏ1 మారుతీరావు 2020లో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఓవైపు అల్లుడ్ని చంపాడని కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లడం, మరోవైపు కుమార్తె అమృత, ఆమె అత్తామామలు చేస్తున్న కామెంట్లతో మనోవేదనకు గురై బలవన్మరణం చెందారు. ఏ2 సుభాష్ కు బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉన్నాడు. మరో నిందితుడు అస్గర్ అలీ మరో కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. మిగతా నిందితులు బెయిల్ రావడంతో బయటకు వచ్చారు.

Also Read: Crime News: వీడు కొడుకు కాదు, కాల యముడు! ఎవరైనా కన్నతల్లిని ఇంత దారుణంగా చంపుతారా ?