నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు యువతి గొంతును దారుణంగా కోసేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. యువతి తనకు దక్కలేదనే అక్కసుతో నిందితుడు ఈ ఆకృ త్యానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నల్గొండ జిల్లాలోని నేరేడుచర్ల మండలం రాజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ యువతిపై బాలసైదులు అనే యువకుడు బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. తరచుగా ప్రేమిస్తున్నానని అమ్మాయిని వేదిస్తున్న యువకుడు.. ఆమెకు మరొకరితో పెళ్లి కుదిరిందని తెలుసుకొని దాడికి పాల్పడ్డాడు. ఒంటరిగా వెళ్తున్న యువతిపై బాలసైదులు బ్లేడుతో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. యువతి పరిస్థితి విషమించడంతో 108 వాహనంలో మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధితురాలి బంధువులను విచారణ జరుపుతున్నారు.
నిందితుడు గొంతు కోయడంతో తీవ్రంగా గాయపడ్డ యువతిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.