మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో వివాదం రోజురోజుకీ ముదిరిపోతోంది. పోటీలో ఉన్న అభ్యర్థులు అనూహ్యంగా తప్పుకోవడం, తెరపైకి మరికొందరి పేర్లు రావడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అయితే ఈ సారి ‘మా ఎన్నికలు’  మొత్తం ‘మా బిల్డింగ్‌’ చుట్టూనే తిరుగుతున్నాయి. దీనిపై మోహన్ బాబు- నాగబాబు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై చర్చిస్తూ ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు నేతృత్వంలో గత నెలలో జూమ్‌ మీటింగ్‌ జరిగింది. పలువురు ‘మా’ సభ్యులు అందులో పాల్గొన్నారు. మీటింగ్‌లో భాగంగా మాట్లాడిన మోహన్‌బాబు ‘‘అధిక మొత్తంతో ‘మా’ భవనాన్ని కొనుగోలు చేసి అతి తక్కువ ధరకే దానిని ఎందుకు అమ్మేశారు? సినిమా పెద్దలు అప్పుడు ఎందుకని పెదవి విప్పలేదు’’ అని ప్రశ్నించారు. దీనికి కౌంటర్ ఇస్తూ తాజాగా నాగబాబు విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది.


బిల్డింగ్‌ అమ్మకం వ్యవహారమంతా నరేశ్‌-శివాజీరాజాలకే తెలుసని అన్నారు. భవనం అమ్మకం గురించి నరేశ్‌నే ప్రశ్నించాలన్నారు. ఈ సారి ప్రకాశ్ రాజ్‌కు మద్దతిస్తున్నామన్న నాగబాబు.. ఇక్కడ అతని శక్తి సామర్థ్యాల గురించే మాట్లాడాలి. మిగతా అంశాల గురించి మాట్లాడొద్దు అన్నారు. 2006 నుంచి 2008 వరకు బిల్డింగ్‌ను కొన్నాం. అంతకు ముందు నుంచే బిల్డింగ్ సమస్య ఉంది. చాంబర్ వాళ్లు మమ్మల్ని ఖాళీ చేయమని ఒత్తిడి తెచ్చేవారు. అప్పుడు కొత్త బిల్డింగ్ కొనాల్సి వచ్చింది. కానీ ప్రతీ సారి ఎన్నికల్లో మా బిల్డింగ్ కొన్నారు, అమ్మారు అంటూ కామెంట్లు చేస్తూ వచ్చారు. ఈ విషయంపై ఎవరు మాట్లాడినా స్పందించేవాడినని కాదు. కానీ మోహన్ బాబు వంటి వారు అడగడంతో చెబుతున్నా అని అన్నారు. 


‘‘బిల్డింగ్ కొనుగోలు చేసే సమయంలో తానే అధ్యక్షుడిగా ఉన్నా. అన్ని కలుపుకుని దాదాపు రూ.1.30 కోట్లు అయ్యాయి. పరుచూరి గోపాల కృష్ణ, సలహ, సూచలనతో శ్రీనగర్ కాలనీలో డైరెక్టర్స్ అండ్ రైటర్స్ అసోసియేషన్ బిల్డింగ్‌కు దగ్గర్లో భవనం కొన్నాం. 140స్క్వేర్ యార్డ్స్ స్థలంలో ఉన్న భవనాన్ని రూ.71 లక్షలకు కొన్నాం. ఇంకో రూ.మూడు లక్షలతో రిపేర్ చేయించాం. ఇంకో రూ.పదిహేను లక్షలతో కొంత రెన్యువేట్ చేయించాం. మొత్తం రూ.96 లక్షలు ఖర్చు అయింది. కానీ 2017లో శివాజీ రాజా అధ్యక్షుడిగా నరేష్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు తక్కువ రేటుకు అమ్మేశారు’’ అని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన కారణాలు కూడా చెప్పారంటూ సుదీర్ఘ వివరణ ఇస్తూ నాగబాబు వీడియోను షేర్ చేశారు.  మరి దీనిపై మోహన్ బాబు అండ్ టీమ్ ఏమంటాలో చూడాలి.


నాగబాబు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియో: