Nalgonda Crime News: నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో పట్టు పగలే దొంగలు రెచ్చిపోయారు. దామరచర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అజ్మీర మాలు ఓ ఇంటి స్థలం విక్రయానికి సంబంధించి మిర్యాలగూడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పని పూర్తి చేసుకొన్నాడు. అక్కడి నుంచి తన మిత్రులతో కలిసి ఐదు లక్షల రూపాయలను కారులో పెట్టి.. భోజనం చేసేందుకని ఓ రెస్టారెంట్ వద్ద ఆగాడు. కారు పార్కింగ్ చేసి అంతా రెస్టారెంట్ లోపలికి వెళ్లారు. ఈక్రమంలోనే వారిని అనుసరిస్తూ బైక్ మీద వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు.. రెప్పపాటులో కారు అద్దాలు పగలగొట్టి ఐదు లక్షల క్యాష్ బ్యాగుతో పరారయ్యారు. అయితే భోజనం చేసి బయటకు వచ్చిన బాధితులు దొంగతనం జరిగినట్లు గుర్తించి వెంటనే వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెస్టారెంట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఫుటేజీ సాయంతోనే నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. 


ఇటీవలే కృష్ణా జిల్లాలో ఉంగరాల బాక్స్ చోరీ


కృష్ణా జిల్లా చల్లపల్లిలోని ఓ జ్యువెల్లరీ షాపులో గురువారం రోజు రాత్రి చోరీ జరిగింది. ఓ ఉంగరం కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తి.. యజమానుల కళ్లుగప్పి ఉంగరాల పెట్టెతో సహా ఉండాయించాడు. అపరిచిత వ్యక్తి చోరీకి పాల్పడిన వైనం తీవ్ర కలకలాన్ని సృష్టించింది. బందరు రోడ్డులోని పరిశె యుగంధర్ కు చెందిన స్వాతి జ్యూయలరీలో ఈ చోరీ జరిగింది. గురువారం రాత్రి 9 గంటల సమయంలో టోపీ ధరించిన ఓ వ్యక్తి ఉంగరాలు కొనేందుకు వచ్చాడు. బాక్సులో ఉంగరాలు తీసి చూపుతుండగా, ఉంగరాలు సెలక్షన్ చేసుకుంటున్నట్లు నటిస్తూ ఒక్కసారిగా బాక్సు చేత పట్టుకుని బయటకు పరుగులు తీశాడు. అదే సమయంలో షాపు బయట  ఒక వ్యక్తి బైక్ పై సిద్ధంగా ఉండగా, బైక్ ఎక్కి పరారయ్యాడు. ఏం చేయాలో పాలుపోని జ్యువెల్లరీ షాపు యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన రంగంలోకి దిగిన చల్లపల్లి సీఐ బి.భీమేశ్వర రవికుమార్, ఎస్ఐ సిహెచ్. చిన్నబాబులు ఘటనా ప్రదేశానికి వచ్చి వివరాలు సేకరించారు. మొత్తం 48 ఉంగరాలు సుమారు 80 గ్రాముల పైగా బరువు ఉంటాయనీ, నాలుగు లక్షల విలువ చేస్తాయని జ్యూయలర్స్ యజమాని  యుగంధర్ తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సిబ్బందిని అప్రమత్తం చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.


"మా షాపుకి ఈరోజు ఒక దొంగ వచ్చి నా చేతిలో ఉన్నటువంటి బాక్సు లాక్కొని వెళ్లిపోయాడండి. నిన్న ఇదే టయానికి వచ్చాడు. ఇక్కడే నిల్చొని అన్నీ అడిగాడన్నమాట. ఏమనీ.. ఉంగరాలు ఉన్నాయా అని అడిగాడు. బాబు షాపు కట్టేసే టైంది. మీరెళ్లి పోవచ్చు... మేము ఉంగరాలు అమ్మము అని చెప్పాను. మా చుట్టాలున్నారండీ.. ఒక్క ఐదు నిమిషాలు ఆగండి వచ్చేస్తారని చెప్పాడు. షాపు తీసే ఉంచుతారా, తీసే ఉంచుతారా అని అడిగాడు. షాపు కట్టేస్తాం ఉంచము అని అన్నాం. మళ్లీ ఈరోజు ఇదే టయానికి వచ్చాడు. వచ్చి ఉంగరాలు చూపిచండి అని అడిగాడు. చూపిస్తుంటే ఇదెంత, ఇదెంత, ఇదెంత అంటూ అన్ని ఉంగరాల ధరలు అడిగాడు. దీనికింత, దీనికంత అంటూ నేను అన్నీ చెప్పాను. ఊరికే బాక్సు పట్టుకున్నాడు. మూడు సార్లు కూడా నేను వెనక్కి లాక్కున్నాను. కానీ నాలుగో సారి చూస్తానంటూ పట్టుకొని పారిపోయాడు. దొంగా, దొంగా, దొంగా అంటూ అరుచుకుంటూ వెళ్లాను. చాలా దూరం పరిగెత్తుకుంటా వెళ్లాను. ఆ తర్వాత వెంటనే స్టేషన్ కు వెళ్లాను. స్టేషన్ కు వెళ్లేసరికి ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు. చెప్పాను. మళ్లా వెంటనే వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చిన తర్వా ఎవరూ కనిపించలేదు. ఆ బండేమో స్టార్ సిటీ బండి. ముందు కూర్చున్న అబ్బాయేమో తలపాగా కట్టుకొని ఉన్నాడు. వెనకాల ఈ అబ్బాయి మాత్రం టోపీ పెట్టుకున్నాడు. నిన్న కూడా రావడం అలాగే వచ్చాడు. ఈరోజు కూడా అలాగే టోపీ పెట్టుకొని వచ్చాడు. మొత్తం 40 ఉంగరాలు ఉంటాయండి. సుమారుగా 80 గ్రాముల దాకా బంగారం ఉంటుంది." యుగంధర్, దుకాణా యజమాని