Nalgonda: ఉగాది పండుగ వేళ నల్గొండ జిల్లాలోని ఓ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదాగా మెడలో చున్నీ వేసుకొని తిరుగుతున్న 9 ఏళ్ల బాలుడు క్షణాల వ్యవధిలోనే మరణించాడు. తల్లిదండ్రుల ముందే ఆ బాలుడి తల, మొండెం వేరు అయింది. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గాజీనగర్‌ గ్రామంలో చోటు చేసుకుంది.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గాజీనగర్‌ గ్రామానికి చెందిన పేట జానీ, రాణి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మధు అనే 9 ఏళ్ల కుమారుడు చిన్నవాడు. వీరు గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, శనివారం ఉగాది రోజున సెలవు దినం కావడంతో కుటుంబంలోని నలుగురూ పొలం వెళ్లారు. గ్రామంలోని తమ పొలంలో దంపతులు వేరుశనగల కోత మెషీన్‌ తీసుకొచ్చి పల్లీ మొక్కలను అందులో వేరు చేసి కాయలను వేరు చేస్తున్నారు.


వారి బాలుడు మధు కూడా తన తల్లి చున్నీని మెడలో వేసుకొని అక్కడే తిరుగుతున్నాడు. దీంతో ఆ చున్నీ ప్రమాదవశాత్తు పల్లీ కోత మెషీన్‌లోని ఫ్యానుకు ఆకర్షించబడి అమాంతం లాగేసింది. దీంతో చున్నీతో పాటు బాలుడు కూడా ఫ్యాన్‌‌లోకి వెళ్లిపోయాడు. ఫ్యాను రెక్క బాలుడి మెడకు తాకడంతో తల తెగిపడి అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 


కుమారుడు కన్నవారి కళ్లెదుటే అత్యంత దారుణరీతిలో మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. వారు రోదించిన తీరు అక్కడున్నవారు తీవ్రంగా కలచివేసింది. బాలుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.


నాగర్ కర్నూలులో విషాదం
ఉగాది పండగ పూట నాగర్ కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చారగొండ మండలం తుర్కలపల్లి గ్రామ సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డడారు. నల్గొండ జిల్లా నేరేడుచర్లకు చెందిన కుటుంబం కడప దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగంతో వెళ్తున్న కారు రోడ్డుపక్కనే ఉన్న సిమెంట్ దిమ్మను ఢీకొని బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.