కుటుంబ కలహాల వల్ల ఓ తల్లి తన కన్న పిల్లలనే తుంచేసుకుంది. ఏకంగా నలుగురు పిల్లలను కాలువలో పడేసి హతమార్చింది. వీరిలో ముగ్గురు నీటిలో మునిగిపోయి అక్కడికక్కడే మృతి చెందగా... మరో పిల్లాడి ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ హృదయ విదారకర ఘటన నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి మండలం మంగనూరులో శనివారం జరిగింది.
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరులో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో నలుగు పిల్లలను ఓ తల్లి కాలువలో పడేసింది. దీంతో ఈ ఘటనలో చిన్నారులు మహాలక్ష్మి (5), చరిత (4), మంజుల (3) మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఏడు నెలల బాలుడు మార్కండేయ ఆచూకీ ఇంకా లభించలేదు. మార్కండేయ కోసం స్థానికులు, పోలీసులు నీళ్లలో గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రేమ వివాహం, కానీ కలతలు ....
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని మంగనూరు గ్రామంలో శరవంద, లలిత ప్రేమ వివాహం చేసుకొని దాంపత్య జీవితం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నాడు. అయితే గత కొంతకాలం నుంచి వీరి సంసార జీవితంలో కలతలు మొదలయ్యాయి. అప్పటినుంచి నిత్యం భార్యాభర్తలు ఇద్దరు గొడవలు పడేవారు. నిత్యం గొడవలతో సతమతమైన భార్య ఇక రోజు ఇదే పరిస్థితి ఎదురవుతుందని జీవితంపై విరక్తి చెంది లలితా తన నలుగురు పిల్లలను తీసుకొని ఉదయం బిజినేపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది.
అక్కడే పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న కేఎల్ఐ కాల్వ దగ్గరకు వెళ్ళింది. మొదట ఆ కాలువలో పిల్లలు నలుగురిని పడేసి... ఆమె కూడా కాల్వలోకి దూకేసింది. ఆమె దూకిన విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే తన రక్షించగా సురక్షితంగా బయటపడింది. కానీ నలుగురు పిల్లలు నీళ్లలో మునిగిపోయారు. అందులో ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే చనిపోయి మృతదేహాలు పైకి కనిపించాయి. మరో ఏడు నెలల కుమారుడి ఆచూకీ మాత్రం లభించలేదు. స్థానికులు ఎంత కాలువలో గాలించిన కానీ కుమారుడి మృతదేహం మాత్రం దొరకలేదు. దీంతో తల్లిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
సంసార జీవితంలో పిల్లల బలి చేయవద్దు...
దాంపత్య జీవితం అన్నాక గొడవలు సాధారణం. గొడవపడి వెంటనే మరచిపోవాలి తప్ప ఇలా పిల్లల ప్రాణాలను బలి చేయొద్దని మానసిక నిపుణులు చెబుతున్నారు. పిల్లలు దేవుళ్ళతో సమానమని వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి తప్ప భార్యాభర్తల గొడవల వల్ల వారిని బలి చేయవద్దని వెల్లడిస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి తప్ప... ఇలా పిల్లల ప్రాణాలు తీసే హక్కు తల్లిదండ్రులకు లేదని చెబుతున్నారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకు తమతో ఆడుకున్న చిన్నారులు ప్రస్తుతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని స్థానికులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను భార్యాభర్తల గొడవల కారణాలవల్ల మృతి చెందడం తీరని వేదనగా గ్రామస్తులు చెబుతున్నారు.