Mumbai Murder: మూడు రోజుల క్రితం ముంబయిలో జరిగిన అత్యంత దారుణ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు నిందితుడు మనోజ్.. సరస్వతి శరీర భాగాలను ఎలా, ఎక్కడ పారేయాలి, దుర్వాసన రాకుండా ఏం చేయాలనే విషయాల గురించి గూగుల్ లో వెతికినట్లు పోలీసులు గుర్తించారు. ఓ వెబ్ సిరీస్ చూసి మనోజ్.. సరస్వతిని హత్య చేసినట్లు తేల్చారు. సరస్వతిని చంపిన తర్వాత మృతదేహాన్నిమనోజ్ ఫొటో కూడా తీసినట్లు గుర్తించారు. అయితే హత్య అనంతరం పోలీసులకు చిక్కిన నిందితుడు.. సరస్వతి, తాను అనాథలం అని చెప్పాడు. కానీ అదంతా అబద్ధం అని పోలీసులు వెల్లడించారు. సరస్వతి హత్య జరిగినట్లు తెలుసుకున్న తర్వాత ఆమె ముగ్గురు సోదరీమణులు పోలీసులను ఆశ్రయించారు. అయితే నిజమేనా కాదా అని తెలుసుకునేందుకు పోలీసులు డీఎన్ఏ పరీక్షలు చేయించారు. అనంతరం వారందరినీ అక్కాచెల్లెళ్లుగా నిర్ధారించుకొని.. సరస్వతి మృతదేహాన్ని వారికి అప్పగించారు.
అసలేం జరిగిందంటే?
మూడు రోజుల క్రితం ముంబయిలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఓ మహిళను ముక్కలు ముక్కలుగా నరికాడు ఓ వ్యక్తి. వీళ్లిద్దరూ చాన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం...డెడ్‌బాడీని ముక్కలు చేయడమే కాదు. వాటిలో కొన్ని భాగాల్ని కుక్కర్లో వేసి ఉడికించాడు. మరి కొన్ని అవయవాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేశాడు. తలుచుకుంటేనే ఒళ్లు వణికిపోయేంత పాశవికంగా ప్రవర్తించాడు. ఇంటిని సీజ్ చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గీతానగర్‌లోని ఫేజ్-7 లో ఈ దారుణం జరిగింది. 56 ఏళ్ల మనోజ్ సానే, 32 ఏళ్ల సరస్వతి వైద్య మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఆమెను ఇలా రాక్షసంగా చంపేశాడు. పొరుగింటి వాళ్లకు దుర్వాసన రావడం వల్ల వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు రంగంలోకి దిగాక కానీ ఈ మర్డర్ గురించి తెలియలేదు.
బాడీని ముక్కలు చేసి పడేయాలనుకున్న నిందితుడు
అప్పటికే స్పాట్లో ఉన్న నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. శ్రద్ధావాకర్ హత్యను గుర్తు చేసింది ఈ మర్డర్. బాడీని ముక్కలు నరికి ఎక్కడ పడితే అక్కడ పారేయాలని అనుకున్నాడు. వాటిని కట్ చేయడానికి కట్టర్ మెషీన్‌ని వాడాడు. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. ప్రాథమికంగా కొన్ని వివరాలు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న ఆమె బాడీని కనిపించకుండా చేయాలని ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పారు.
"మనోజ్ సానే, సరస్వతి వైద్య మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. సరస్వతి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని మనోజ్ గమనించాడు. దీనిపై మూడు, నాలుగు రోజులుగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ వివాదం ముదిరింది. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ చూసి మరీ విషమిచ్చి హత్య చేశాడు. పోలీసులు తనను అనుమానిస్తారేమో అన్న భయంతో డెడ్‌బాడీ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూశాడు. కట్టర్‌తో శరీరాన్ని ముక్కలుగా కోశాడు. వాటిని దాచి పెట్టాడు. కొన్నింటిని కుక్కర్లో వేసి ఉడికించాడు. మరి కొన్నింటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేశాడు. బైక్‌పై వాటిని పెట్టుకుని వాటిని పారేసేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఈ ఇంటిని సీజ్ చేసి ఆ మహిళ శరీర భాగాల్ని సేకరించాం"