BMW Hit And Run Case:  దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో శివసేన నేత రాజేశ్‌ షా కుమారుడు మద్యం మత్తులో ర్యాష్​ డ్రైవింగ్‌ చేసి ఓ వివాహిత మరణానికి కారణం కావడం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో మూడు రోజులుగా పరారీలో ఉన్న  ప్రధాన నిందితుడు మిహిర్ షాను పోలీసులు మంగళవారం (జులై 9న) అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిహిర్ షా మద్యం మత్తులో కారు నడిపారు. అతను నడుపుతున్న కారు ముంబైలోని వర్లీలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 45 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. మిహిర్ షా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకి చెందిన శివసేన నాయకుడు రాజేష్ షా కుమారుడు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు యాక్సిడెంట్ చేసి తర్వాత పరారయ్యారు.

  


11 టీమ్స్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
మిహిర్‌ను ముంబై సమీపంలో అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. 72 గంట‌ల త‌ర్వాత ముంబయికి 65 కి.మీ. దూరంలో ఉన్న విరార్‌లోని అపార్ట్‌మెంట్‌లో మిహిర్ షాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతని తల్లి, సోదరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని వర్లీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన కొడుకు తప్పించుకోవడంలో మిహిర్ తండ్రి రాజేష్ షా కీలక పాత్ర పోషించాడని, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని అక్కడి నుంచి తరలించేందుకు కుట్ర పన్నాడని చెప్పుకొచ్చారు. మిహిర్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు 11 బృందాలను ఏర్పాటు చేశారు. క్రైమ్ బ్రాంచ్‌ను కూడా విచారణలో చేర్చారు.  పోలీసులు అతనిపై లుక్‌అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి) కూడా జారీ చేశారు. ఇక మిహిర్ అరెస్టుకు ముందు అత‌డి తప్పతాగి రూ. 18 వేల బిల్ చేసిన ద వైస్ గ్లోబల్ తపస్ బార్‌ను ముంబై పోలీసులు సీజ్ చేశారు. 


 ప్రమాదం ఎలా జరిగిందంటే ?  
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్లి కోలివాడలో నివాసముంటున్న కావేరి నఖ్వా (45) ఆదివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తన భర్త ప్రదీప్‌తో కలిసి డాక్టర్ అన్నీ బిసెంట్ రోడ్డు గుండా వెళ్తున్నారు. అదే సమయంలో బిఎమ్‌డబ్ల్యూలో వెళుతున్న మిహిర్ షా దంపతులు ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొట్టాడు. చేపలు అమ్ముకుంటూ జీవిస్తున్న ఈ దంపతులు ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.  బాధితురాలు కావేరీ నక్వాను నిందితుడు మిహిర్‌ షా కారు త‌న‌ బానెట్‌పై సుమారు 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.  కారు బ‌లంగా ఢీకొట్టడంతోనే కావేరీ ఎగిరి కారు బానెట్‌పై పడింది.  అలాగే కిలోమీటర్‌ వెళ్లిన తర్వాత కారుమీదున్న బాడీని కిందకు పడేశారు. అనంతరం అదే కారు రివర్స్‌ చేసి ఆమె శరీరం మీద నుంచి పోనిచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డయినట్లు పోలీసులు కోర్టులో వెల్లడించారు.  


మిహిర్ తండ్రి అరెస్ట్
మహిళను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ప్రమాదం తర్వాత మిహిర్ షా బాంద్రా-వర్లీ సీ లింక్ వైపు పరారయ్యారు. మిహిర్ తప్పించుకోవడానికి సహాయం చేసినందుకు వర్లీ పోలీసులు మిహిర్ తండ్రి రాజేష్ షా, డ్రైవర్ బిదావత్‌లను ఆదివారం అరెస్టు చేశారు. ఆ కారు రాజేష్ షా పేరు మీద ఉంది. ప్రమాద సమయంలో కారులో ఉన్న తన డ్రైవర్ రాజర్షి బిదావత్‌ను ఈ సంఘటనకు బాధ్యత వహించాలని రాజేష్ షా కోరారు. కావేరీ నఖ్వాను కారుతో కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లినట్లు కనిపించిన సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు కోర్టులో సమర్పించారు. ఈ ఫోటోల్లో మిహిర్ షా, సహ నిందితుడు రాజర్షి బిదావత్ మహిళను బానెట్ నుండి లాగడం, ఆమెను రోడ్డుపై ఉంచడం, కారును రివర్స్‌లో  ఆమె పైనుంచి పోనించడం చూడవచ్చు. ఘటన జరిగిన తర్వాత రాజేష్ షా కూడా ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లినట్లు సమాచారం.


కొత్త చట్టాల ప్రకారం కేసు నమోదు
కొత్త ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నేరపూరిత హత్య, ర్యాష్ డ్రైవింగ్, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు రాజేష్ షా పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఈ  ప్రమాదం పుణెలో జ‌రిగిన పోర్చే కారు ఘటనను గుర్తుకు తెచ్చింది.