Monther Kills Infant | హైదరాబాద్: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాతృత్వానికే మచ్చతెచ్చే దారుణం జరిగింది. కన్నతల్లే తన 9 నెలల ముక్కుపచ్చలారని పసిపాపను చెరువులో ముంచి అతి దారుణంగా హత్య చేసింది. ఇంజాపూర్ గ్రామానికి చెందిన లోకసాని రాజేశ్వరి (34) అనే మహిళ ఆదివారం సాయంత్రం సుమారు 6:30 గంటల ప్రాంతంలో తన కుమార్తె అనురాధను బైరామల్‌గూడ చెరువు వద్దకు తీసుకెళ్లి, నీటిలో ముంచి హత్య చేసింది.
మహిళ ప్రవర్తనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలు రాజేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు రాజేశ్వరిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేవలం మద్యం మత్తులోనే ఈ ఘాతుకానికి పాల్పడిందా లేక ఈ హత్య వెనుక కుటుంబ కలహాలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సంతానం లేక ఎంతోమంది భార్యాభర్తలు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ కడుపున పుట్టిన పసిపాపను తల్లే ఇలా బలితీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
