Tuni RTC Diesel Theft : గతుకుల రోడ్ల మీద మైలేజీ తీసుకు రాలేదని ఎంత మేర డీజిల్ ఎక్కువ ఉపయోగించారో అంత మేర బస్సు డ్రైవర్ జీతంలో కోత విధిస్తామని ఇటీవల ఆర్టీసీ ఉన్నతాధికారులు జారీ చేసిన మెమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెరిగిపోతున్న డీజిల్ ధరల కారణంగా ఆర్టీసీ డ్రైవర్లు మరింత జాగ్రత్తగా ఉండటానికి ఇలాంటి హెచ్చరికలు జారీ చేశారేమోనని అందరూ అనుకున్నారు. మామూలుగా ట్యాంకుల్లోని డీజిల్ విషయంలోనే ఇలా ఉంటే.. మరి డిపోల్లోని పెట్రోల్ ట్యాంకుల దగ్గర ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు కొలతలు తీసుకుని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారని మనం అనుకుంటాం.. కానీ అక్కడ జరిగింది వేరు. ఏకంగా 11వేల లీటర్ల డీజిల్ మాయమైపోయింది.
భూమిలో ఉన్న ట్యాంకర్లో డీజిల్ మాయం !
కాకినాడ జిల్లాల తుని ఆర్టీసీ డిపోలో నిన్నామొన్నటి వరకూ బల్క్‌గా డీజిల్ కొనుగోలు చేసి అంతర్గతంగా పెట్రోలు పంపుల ద్వారా బస్సుల్లో నింపుతూంటారు. ఇదంతా పక్కాగా జరుగుతుంది. ఎంత ఆయిల్ వస్తోంది.. ఎంత బస్సులకు పట్టిస్తున్నారు.. మిగతా ఎంత స్టాక్ ఉంది.. లెక్కలు చూసుకుంటూ ఉంటారు. ఇటీవల బల్క్‌గా కొంటే.. రేటు ఎక్కువ అవుతోందని.. రీటైల్‌గా కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగా ట్యాంకుల్లో ఉండాల్సిన ఆయిల్ అలాగే ఉండిపోయింది. రెండురోజుల కిందట... ట్యాంకులో చూస్తే చుక్క కూడా డీజిల్ కనిపించలేదు.
ట్యాంకర్‌కు చిల్లు పడి భూమిలో ఇంకిపోయిందంటున్న అధికారులు
మొత్తంగా పదకొండు వేల లీటర్ల డీజిల్ కనిపించకుండా పోయింది. దీంతో ఇంటి దొంగలే కాజేరేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆర్టిసి గ్యారేజీ వద్ద భూమిలో ఉన్న ట్యాంకర్ లీకైందని చెబుతున్నారు. భూమిలో ట్యాంకర్ లీకవడం వల్ల డీజిల్ మొత్తం ఇంకిపోయిందని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఆర్టిసి విజిలెన్స్ బృందం విచారణ చేపడుతున్నట్లు తెలుస్తుంది. ట్యాంకర్ లీకేజీతోనే డీజిల్ కనిపించడం లేదా ? మరేదైనా కారణం ఉందా ? అనే కోణంలో విజిలెన్స్ అధికారులు తేల్చనున్నారు.
విజిలెన్స్ విచారణ ప్రారంభఁ - డీజిల్ ఏమయిందో బయటకు వస్తుందా ?
గతంలో కొన్ని చోట్ల మద్యం.. బియ్యం.. గోధుమలు వంటివి ప్రభుత్వం గోడౌన్లలో మిస్సయ్యేవి. అప్పుడు ఎలుకలు తిన్నాయని.. మరొకటని కారణంగా చెప్పేవారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. కానీ ఇప్పుడు మాత్రం డీజిల్ భూమిలో ఇంకిపోయిందని చెబుతున్నారు. ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.