హైదరాబాద్: నగరంలో చోటుచేసుకున్న ఒక భారీ సైబర్ మోసం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నకిలీ పెట్టుబడుల పేరిట జరిగిన ఈ మోసంలో ఎర్రగడ్డకు చెందిన ఒక డాక్టర్ ఏకంగా రూ.14.61 కోట్లు కోల్పోయాడు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో ఇంత భారీ మొత్తంలో మోసపోవడం ఇదే మొదటిసారి. దీంతో ఈ కేసును రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
మోసం జరిగిన తీరు ఇదీ..బాధితుడైన డాక్టర్‌కు కంబోడియా దేశం నుండి అందమైన అమ్మాయిల ఫొటోలతో మెస్సేజ్‌లు చేసి సైబర్ నేరగాళ్లు ఎర వేశారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి బురిడీ కొట్టించారు. సైబర్ నేరగాళ్ల మాటలను నిజమని నమ్మిన డాక్టర్, లాభాల ఆశతో ఏకంగా తన ఇంటిని అమ్మి వచ్చిన డబ్బును కూడా విడతలవారీగా పెట్టుబడిగా పెట్టాడు. తీరా అసలు విషయం తెలిసేసరికి ఆలస్యమైంది. మోసపోయానని గ్రహించేసరికి తన వద్ద ఉన్న రూ.14 కోట్లకు పైగా నగదు నేరగాళ్ల ఖాతాల్లోకి చేరిపోయింది.
నిందితుల అరెస్ట్ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన బ్రహ్మినాయుడు, మణిరామ్, పవన్, శివకృష్ణ అనే నలుగురు వ్యక్తులను శనివారం అరెస్టు చేశారు. వీరు నేరుగా మోసం చేయకపోయినా, సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్స్ ఇచ్చి సహకరించినట్లు గుర్తించారు. ప్రధాన నిందితులకు 'మ్యూల్ బ్యాంక్ ఖాతాలు' (Mule Accounts) అంటే అద్దెకు తీసుకున్న లేదా ఇతరుల పేర్లతో ఉన్న ఖాతాలను సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు. నేరగాళ్లు దోచేసిన రూ.14.61 కోట్ల డబ్బును దారి మళ్లించడానికి ఈ ఖాతాలను వాడుకున్నట్లు తేలింది.
న్యాయస్థానం విచారణఅరెస్టయిన నలుగురు నిందితుల నుండి మరింత సమాచారం సేకరించేందుకు వారిని 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మోసం వెనుక అంతర్జాతీయ ముఠాల హస్తం ఉందా? ఇంకా ఎంతమందిని వీరు మోసం చేశారు? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి న్యాయస్థానం సోమవారం (డిసెంబర్ 22న) తన తీర్పును వెల్లడించనుంది.
ముఖ్యమైన గమనిక.. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు లేదా అధిక లాభాల పేరిట సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులు, అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ఆర్థిక నిపుణులు ప్రజలను హెచ్చరించారు.
మ్యూల్ అకౌంట్ అంటే ఏంటీ..
సైబర్ నేరాల ప్రపంచంలో మ్యూల్ అకౌంట్ (Mule Account) అనేది నేరగాళ్లు తాము దోచుకున్న సొమ్మును దాచడానికి లేదా ఒక చోటు నుండి మరో చోటుకు తరలించడానికి ఉపయోగించే ఒక మధ్యవర్తి బ్యాంక్ అకౌంట్. దొంగిలించిన డబ్బును నేరుగా తమ సొంత ఖాతాల్లోకి వేసుకుంటే పోలీసులు పట్టుకుంటారనే భయంతో, నేరగాళ్లు ఇతరుల ఖాతాలను వాడుకుంటారు. ఈ ప్రక్రియను 'మనీ లాండరింగ్'లో భాగంగా పరిగణిస్తారు. ఆ ఖాతాలను మ్యూల్ అకౌంట్ అంటారు.