మంచిర్యాల జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు (వీరిలో ఒకరు ట్రాన్స్‌జెండర్) ప్రేమించుకున్నారు. వారు పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు. ఇంతలో తీవ్ర విషాదం నెలకొని ఉంది. వారు ఇద్దరూ ఓ నిర్మానుష్య ప్రదేశంలో అపస్మారక స్థితి పడి ఉండడాన్ని స్థానికులు గమనించారు. చివరికి ఇద్దరిలో ఒకరు మృతి చెందారు. మరొకరు చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ అనుమానాస్పద  మృతి కేసు బుధవారం వెలుగులోకి వచ్చింది. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.


స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొద్ది రోజులుగా కలిసి వీరు ఒకే గదిలో ఉంటున్నారు. ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో కనిపించారు. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తున్నారు. అంజలి, మహేశ్వరి (ట్రాన్స్‌జెండర్) అనే అమ్మాయిలు ఇద్దరూ దూరపు బంధువులు. వీరి రెండు కుటుంబాలకు చాలా దూరపు బంధుత్వం ఉంది. అప్పుడప్పుడు చుట్టరికంగా కలుసుకొనే వీరు ఇద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెండ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇద్దరిలో మహేశ్వరి ట్రాన్స్ జెండర్. పెండ్లి చేసుకోవాలనుకున్న వీరు కొద్ది రోజులుగా ప్రత్యేకంగా కలిసి ఉంటున్నారు. 


మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో ఒక రూం అద్దెకు తీసుకుని సహ జీవనం చేస్తున్నారు. కానీ, ఏమైందో తెలియదు కానీ, వీరిద్దరు స్పృహ తప్పిన స్థితిలో పాదచారులకి కనిపించారు. స్థానిక రామకృష్ణా పూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో అపస్మారక స్థితిలో కనిపించారు. తీవ్ర గాయాలతో ఉన్న యువతి అంజలి, ట్రాన్స్‌జెండర్ మహేశ్వరిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో అంజలి మృతి చెందింది. ట్రాన్స్‌జెండర్ అయిన మహేశ్వరి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. 


ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ ప్రేమ పెళ్లి వరకూ వెళ్లడానికి వీలు పడడం లేదని వీరిద్దరూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారా? లేక ఎవరైనా హత్యా ప్రయత్నం చేశారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అంజలి మృతిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే, అంజలిని గొంతు కోసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 


ఇటీవల అంజలి, మహేశ్వరితో సరిగ్గా ఉండడం లేదని, గొడవలు పడ్డారని తెలిపారు. అంతేకాక, వారు ఇద్దరూ వివాహం చేసుకొనే విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. గొడవ విషయంలో నిన్న వీరు ఇద్దరితో మరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే, ఇద్దరి ఫోన్లలోని కాల్ రికార్డులు పరిశీలిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు.