Mancherial Police: మనకు ఏదైనా సమస్య రాగానే వెంటనే పోలీసుల వద్దకు పరిగెడుతుంటాం. ఎవరైనా తాగి వచ్చి అల్లరి చేసినా, హత్య, అఘాయిత్యం లాంటివి చేసేందుకు వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. హుటాహుటిన రంగంలోకి దిగి వాళ్లు కూడా తమ బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. చాలా వరకు ఆపదలో ఉన్నామని చెప్పిన వెంటనే వచ్చి కాపాడుతుంటారు. కానీ అంతటి గౌరవపర వృత్తిలో ఉండి కూడా ఓ ఎస్సై.. ఫూటుగా మద్యం తాగి వీధి రౌడీలా ప్రవర్తించాడు. మద్యం మత్తులో రోడ్డు మీదకు వచ్చి నానా హంగామా చేశాడు. మంచిర్యాల జిల్లాల్లో ఈ ఘటన జరిగింది.
రౌడీల్లా మారిన పోలీసులు.. కానిస్టేబుళ్లపై దాడి!
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ ఏస్సై వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కరీంనగర్ పోలీసు కమిసనరేట్ పరిధిలోని బెజ్జంకి పోలీస్ స్టేషన్ ఎస్సై తిరుపతి తన అనుచరులు, స్నేహితులతో కలిసి అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ నానా హంగామా చేశారు. పట్టణంలోని ఐబీ ప్రాంతంలోని రోడ్లపై మంగళవారం అర్థరాత్రి పోలీసులు హల్ చల్ చేశారు. అప్పటికే పూటుగా తాగి ఉన్న పోలీసులు.. నానా రబస చేశారు. మద్యం సేవిస్తున్న వారిలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎస్సై, అతడి స్నేహితులు ఉన్నారు. ఇబ్బందులకు గురైన వాహనదారులు 100 డయల్ కు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి బ్లూకోర్టు పోలీసులు చేరుకొని వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.
పోలీసులు విచారణ చేపట్టే సమయంలో ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక హోంగార్డులపై సైతం ఎస్సై తిరుపతి అతడి స్నేహితులు దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన ఘటనను వీడియో తీస్తుంటే పరుష దూషిస్తూ, పోలీసుల వద్ద ఉన్న ట్యాబ్ లను లాగేసుకుని ధ్వంసం చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంగం సృష్టించిన బెజ్జంకి ఎస్సై కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మంచిర్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.