Mancherial Municipal Commissioner Balakrishna Wife committed Suicide: మంచిర్యాలలో విషాదం చోటుచేసుకుంది. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య జ్యోతి ఆత్మహత్య చేసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు గానీ మంగళవారం నాడు ఆమె ఆదిత్య ఎన్ క్లేవ్ కాలనీలోని తన నివాసంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. డెడ్ బాడీని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


అసలేం జరిగిందంటే..
పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల పట్టణం మేదరివాడలోని ఆదిత్య ఎన్ క్లేవ్ లో మున్సిపల్ కమీషనర్ బాలకృష్ణ భార్య జ్యోతి వారి ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. బాలకృష్ణ భార్య జ్యోతి మంగళవారం ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న మంచిర్యాల ఏసిపి తిరుపతి రెడ్డి, సిఐ నారాయణ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
గతంలో పోలీసు శాఖలో చేసిన బాలకృష్ణ
ఖమ్మం జిల్లాకు చెందిన బాలకృష్ణ గతంలో పోలీసు శాఖలో పని చేశారు. ఆ తర్వాత సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి నిర్మల్ మున్సిపల్ కమిషనర్ గా తొలి పోస్టింగ్ పొందారు. పదోన్నతిపై గ్రేడ్ వన్ కమిషనర్ గా మంచిర్యాలకు వచ్చారు. ఆయన మంచిర్యాల పట్టణం మేదరివాడలోని ఆదిత్య ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్నారు. భార్య భర్తలు తరచూ గొడవ పడేవారని ప్రచారం జరుగుతుంది. బాలకృష్ణ జ్యోతి దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. విషయం తెలుసుకున్న జ్యోతి తల్లిదండ్రులు బంధువులు ఖమ్మం జిల్లా నుండి బయలుదేరారు. కుటుంబ సభ్యులు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.