Man objects Durga Puja dance son beat him to death: దుర్గా పూజా ఉత్సవాల సమయంలో మధ్యప్రదేశ్‌లోని ఒక కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మౌగంజ్ జిల్లానులో 62 ఏళ్ల వృద్ధుడు రామ్రతి విశ్వకర్మను కుటుంబసభ్యులే కొట్టి చంపారు. తన కోడలు దుర్గా మండపంలో నృత్యం చేయడానికి వ్యతిరేకించడంతో కోపోద్రేకమైన తన కుమారుడు, మనవడు, భార్య అతన్ని కొట్టి చంపేశారు.
దుర్గా పూజా పండుగ సందర్భంగా తమ గ్రామంలో మండపం ఏర్పాటు చేశారు. ఆ మండపం వద్ద రామ్రతి కోడలు నృత్యం చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న రామ్రతి అలా చేయడం కుటుంబ పరువుకు వ్యతిరకమని వాదించారు. డాన్స్ చేయవద్దని పట్టుబట్టి.. వ్యతిరేకంగా మాట్లాడటంతో కుటుంబ సభ్యులు కోపం తెచ్చుకున్నారు. మనవడు సోను కర్రతో రామ్రతిని తీవ్రంగా కొట్టాడు. తర్వాత కుమారుడు వేద్‌ప్రకాష్, భార్య కూడా అతన్ని కొట్టారు. ఈ దెబ్బలకు తాళలేక అతను చనిపోయాడు.
ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మౌగంజ్ పోలీస్ తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. 24 గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిని కోర్టుకు హాజరు పరిచారు. ఈ కేసు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 103(1) , 3(5) ల కింద నమోదు చేశారు. "కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వివాదం ఈ హత్యకు కారణం అయింది. దుర్గా పూజా ఉత్సవాలు శాంతి, సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించాలి, కానీ ఇలాంటి ఘటనలు బాధాకరం" అని పోలీసులు చెబుతున్నారు. గ్రామస్థులు ఈ ఘటనపై షాక్‌లో ఉన్నారు మరియు కుటుంబ సంబంధాల్లో మార్పు అవసరమని అంటున్నారు.
ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహిళల హక్కులు, కుటుంబ వివాదాలు, మతపరమైన ఉత్సవాల సమయంలో జాగ్రత్తలపై దృష్టి పెరగాలని నిపుణులు సూచిస్తున్నారు.