Man Died Due To Jumped From Building In Hyderabad: ఓ భవనంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. దీంతో అక్కడ ఆడుతున్న వారంతా పరుగులు పెట్టారు. ఈ క్రమంలో అక్కడకు వెళ్లిన ఓ వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో భవనం పైనుంచి దూకాడు. దీంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సికింద్రాబాద్ లాలాపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాలాపేట్‌లోని శాంతినగర్‌కు చెందిన వినయ్ కుమార్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. గురువారం రాత్రి లక్ష్మీనగర్‌లోని ఓ భవనంపై కొందరు పేకాట ఆడుతున్నారు. ఈ క్రమంలో వినయ్ కూడా రాత్రి 10 గంటల ప్రాంతంలో అక్కడకు వెళ్లాడు. అయితే, విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆడుతున్న వారందరినీ పట్టుకునేందుకు యత్నించగా.. కొందరు అక్కడి నుంచి పరారయ్యారు. వినయ్ కూడా పోలీసులను తప్పించుకునే క్రమంలో మూడంతస్తుల భవనం పైనుంచి కిందకు దూకాడు. దీంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వినయ్ మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రాత్రి 10 గంటల వరకూ వినయ్ కుటుంబంతోనే ఉన్నారని, ఎవరో కాల్ చేస్తే వెళ్లొస్తా అంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లారని తెలిపారు. కానీ, ఇంతలోనే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.