Attack on women: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి మండలం కే.కొత్తపాలెం గ్రామంలో అమానుషం జరిగింది. ఓ వ్యక్తి ముగ్గురు ఎస్టీ మహిళలపై పైశాచిక దాడిగి దిగాడు. తమ ఇంట్లో దొంగతనం చేశారని ఆరోపిస్తూ వారిపై దాడికి పాల్పడ్డాడు. చేయని నేరాన్ని ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. అనంతరం పోలీసులతోనూ కొట్టించాడు. 2 రోజులుగా బందీలుగా చేసి ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా మాల మహానాడు అధ్యక్షులు గోవర్థన్, బాధితులను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి వైద్య సహాయం అందించారు. ఈ దాడికి పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాగా, దాడికి పాల్పడిన వ్యక్తి వైసీపీకి చెందిన నాయకుడని తెలుస్తోంది.
బాధితుల కన్నీరు
చేయని నేరాన్ని ఒప్పుకోవాలని మాపై దాడికి పాల్పడ్డారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 'కె.కొత్తపాలెం గ్రామానికి చెందిన మత్తి రాజా అనే వ్యక్తి ఇంట్లో ఫంక్షన్ ఉందని, కొద్ది రోజులు ఇంటి పని చేయాలని పనికి పిలిచారు. ఆ తర్వాత ఇంట్లో చోరీ జరిగిందని, అది మేమే చేశామంటూ విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో నా తలకు, ఒళ్లంతా గాయాలయ్యాయి. నేను తప్పు చేయలేదని ఎన్నిసార్లు చెప్పినా, బలవంతంగా నేరాన్ని ఒప్పుకోవాలంటూ మరోసారి పోలీసులతో కొట్టించారు. ప్రశ్నించిన మా అమ్మను సైతం కొట్టారు.' అంటూ బాధిత యువతి కన్నీటి పర్యంతమయ్యారు.
డీఎస్పీకి ఫిర్యాదు
కాగా, ఈ ఘటనపై డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు కృష్ణా జిల్లా మాల మహానాడు అధ్యక్షులు గోవర్థన్ తెలిపారు. 'బాధితులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశాం. ఆయన కేసు నమోదు చేసి, పూర్తి వివరాలు సేకరించిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.' అని చెప్పారు.