Annamayya Crime News | నిమ్మనపల్లి: అన్నమయ్య జిల్లా చెందిన నిమ్మనపల్లె మండలంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి చేశాడు. అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన ఇద్దరు కూతుళ్లపై ఆ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తమకు ఏం జరిగింది, నాన్న తమను ఏం చేస్తున్నాడో కూడా తెలియని పసివయసు వారిది. భర్త చేసిన దారుణం తెలియగానే కట్టుకున్న భార్యే ఆ కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది.
అసలేం జరిగిందంటే..
అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం కొండయ్యగారిపల్లి పంచాయతీ వెంకోజిగారిపల్లి శివాజీ నగర్ లో బోయకొండ (28), చిట్టెమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు సంతానం ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో కొడుకు పెద్దవాడు కాగా, మిగిలిన వారు నలుగురు ఆడపిల్లలు. చెట్లు కోసేందుకు, కూలి పనులకు బోయకొండ వెళుతుండేవాడు. అతడి భార్య చిట్టెమ్మ చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ గాజులు విక్రయించేది. ఇలా వీరు కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో బోయకొండ మద్యానికి అలవాటు పడ్డాడు. తాను కూలి పనిచేసి వచ్చిన డబ్బును మద్యం సేవించడానికి ఖర్చు చేసేవాడు.
మరోవైపు కుటుంబాన్ని పోషించేందుకు భార్య గాజులు అమ్మేందుకు బయటకు వెళ్లింది. మద్యం మధ్యలో మత్తులో ఉన్న బోయకొండ కన్ను తన కుమార్తెలపై పడింది. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట పెద్ద కుమార్తె (9) పై లైంగిక దాడి చేశాడు. మరుసటి రోజు రెండవ కుమార్తె (7) పై సైతం దారుణానికి పాల్పడ్డాడు. తరువాతి రోజు ఏడేళ్ల కూతుర్ని మరోసారి బయటకు తీసుకెళ్తుండగా, బోయకొండ అత్త గమనించింది. అతడి తీరు చూస్తే అనుమానం వచ్చి, పాపను ఎక్కడ తీసుకెళ్తున్నావని మందలించడంతో వదిలేసి వెళ్లాడు.
కడుపునొప్పి రావడంతో విషయం వెలుగులోకి..
చిన్నారులు తమకు తీవ్రమైన కడుపు నొప్పి వస్తుందని మేనమామకు, అమ్మమ్మకు చెప్పారు. ఏం జరిగిందని ఆరా తీస్తే చిన్నారులు చెప్పిన విషయం విని వారు షాకయ్యారు. నాన్న తమను తీసుకెళ్లి ఏదో చేశాడని.. అప్పటినుంచి కడుపునొప్పి వస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని చిన్నారుల తల్లి చిట్టికి తెలిపారు. బిడ్డల పరిస్థితిని చూసి చలించిపోయిన కన్నతల్లి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిల్లలపై బలవంతంగా కోరిక తీర్చుకున్న కామాంధుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బోయకొండపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లి పోలీసులు ఆ బాలికలపై లైంగిక దాడి నిర్ధారణ కావడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.