Fire Accident in Medak District: ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఎస్బీ పరిశ్రమలో మేనేజర్ గా చేస్తున్న రవి మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటివరకూ ఏడుగురు వ్యక్తులు చనిపోగా, మరో 10 మంది వరకు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మంటలు పక్కనున్న మరో పరిశ్రమకు వ్యాపిస్తున్నాయి. చుట్టుపక్కల వారిని సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని, మృతదేహాలను సంగారెడ్డిలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు.




అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న సిబ్బంది ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది కంపెనీలోపల ఉన్నట్లు సమాచారం. 4 ఫైరింజన్లతో మంటల్ని ఆర్పేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి అక్కడ భయానక వాతావరణం కనిపిస్తోంది. 


ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి 
సంగారెడ్డి పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందిన ఘటన పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.