Maharashtra Crime:
మహారాష్ట్రలో ఘటన..
మహారాష్ట్రలో క్రికెట్‌లో తలెత్తిన గొడవ హత్య వరకూ దారి తీసింది. ఓ 13 ఏళ్ల బాలుడు 12 ఏళ్ల బాలుడిని బ్యాట్‌తో కొట్టి చంపిన ఘటన సంచలనమైంది. చంద్రాపూర్ జిల్లాలో ఇది జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. జూన్ 3వ తేదీన ఓ గ్రౌండ్‌లో పిల్లలంతా క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆడే విషయంలో ఇద్దరి మధ్య వాదన మొదలైంది. చాలా సేపు వాదులాడుకున్నారు. ఉన్నట్టుండి ఓ బాలుడు తన చేతిలో ఉన్న బ్యాట్‌తో మరో బాలుడి తలపై గట్టిగా కొట్టాడు. బాధితుడు అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. రెండ్రోజుల పాటు చికిత్స అందించినా...లాభం లేకుండా పోయింది. జూన్ 5న ఆ బాలుడు కన్ను మూశాడు. అయితే...అప్పటి వరకూ ఈ ఘటన గురించి ఎవరికీ తెలియలేదు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దహనసంస్కారాలు అయిపోయాక...అప్పుడు ఆ బాలుడి తల్లి పోలీస్ స్టేషన్‌కి వచ్చి విషయమంతా వివరించింది. వెంటనే FIR నమోదు చేసిన పోలీసులు...విచారణ మొదలు పెట్టారు. దహనసంస్కారాలు అయిపోయాక...కంప్లెయింట్ ఎందుకు ఇచ్చారని పోలీసులు అడిగినట్టు సమాచారం. ప్రస్తుతానికి ఆ బాలుడిపై IPC 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
హరియాణాలో మరో దారుణం...
హరియాణాలోని బల్లబగర్‌లో దారుణం జరిగింది. ఓ 15 ఏళ్ల బాలిక 12 ఏళ్ల తన తమ్ముడిని కిరాతకంగా హత్య చేసింది. తల్లిదండ్రులు తన కన్నా తమ్ముడిపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారన్న కోపంతో చంపేసింది. తల్లిదండ్రులిద్దరూ పని చేసుకుని ఇంటికి తిరిగొచ్చిన సమయానికి కొడుకు నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించారు. పడుకున్నాడేమో అనుకుని నిద్ర లేపేందుకు ప్రయత్నించారు. పైన బెడ్ షీట్‌ని తొలగించి చూశారు. గొంతుపై లోతైన గాయాన్ని చూసి షాక్ అయ్యారు. అప్పటికే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జరిగినప్పుడు తమ కూతురు తప్ప ఎవరూ ఇంట్లో లేరని చెబుతున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆ బాలికను ప్రశ్నించారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రులు తనను పట్టించుకోవడం లేదని, తమ్ముడిపైనే వాళ్లకు ప్రేమ ఎక్కువగా ఉందని చెప్పింది. ఈ కోపంతోనే తమ్ముడిని చంపేసినట్టు అంగీకరించింది. ఈ ఇద్దరు పిల్లలూ యూపీలోని నాయనమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఎండాకాలం సెలవులు రావడం వల్ల ఇంటికి వచ్చారు. తల్లిదండ్రులు ఇద్దరినీ సమానంగానే చూసినా...కూతురు మాత్రం కక్ష పెంచుకుంది. ఈ కేసుకి సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.
"తల్లిదండ్రులు అబ్బాయికి ఫోన్ ఇచ్చారు. రోజంతా ఆ ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ కూర్చున్నాడు. ఫోన్ ఇవ్వమని ఎంత అడిగినా ఇవ్వలేదు. దీంతో తమ్ముడిపై అక్క కోపం పెంచుకుంది. గొంతు కోసి చంపేసింది"
- పోలీసులు
అమెరికాలోని టెక్సాస్‌లోనూ 18 ఏళ్ల కుర్రాడు సొంత కుటుంబ సభ్యుల్నే కాల్చి చంపేశాడు. ఎందుకిలా చేశావని అడిగితే "వాళ్లందరూ నన్ను తినేస్తారేమో అని భయం వేసింది. అందుకే చంపేశాను" అని సమాధానం చెప్పాడు. ఇది విని పోలీసులు షాక్ అయ్యారు. స్థానికంగా ఈ ఘటన సంచలనమైంది.
Also Read: Mumbai Murder: మహిళ బాడీని ముక్కలుగా నరికాడు, కుక్కర్‌లో ఉడికించాడు - ఒళ్లు జలదరించే దారుణం