Pune Boy Rape: పొట్టచేత్తో పట్టుకొని మరో ప్రాంతానికి వలస వెళ్లిన కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. 13 ఏళ్ల దివ్యాంగ (మూగ) బాలుడిపై ఇద్దరు యువకులు అసహజ రీతిలో అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆ పిల్లాడ్ని చంపేసి చెత్త కుండీలో పడేశారు. ఉపాధి కోసం కుటుంబంతో కలిసి పక్క రాష్ట్రానికి వెళ్తే కన్నకొడుకు ప్రాణాలు బలిగొన్నారు కామాంధులు. ఈ అత్యంత దారుణమైన ఈ ఘటన మహారాష్ట్రంలోని పుణెలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబం మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినది కావడంతో ఇక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.


గండేడ్‌ మండలంలోని పీర్లబండ తండాకు చెందిన ఓ దంపతులకు ముగ్గురు సంతానం. రెండో సంతానమైన కరణ్‌ (13) దివ్యాంగుడు ఈ దంపతులు ఉపాధి నిమిత్తం 15 ఏళ్లుగా పూణెలో ఉంటూ కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల క్రితం సొంత గ్రామానికి వచ్చి మళ్లీ రెండు నెలల క్రితమే కరణ్‌తో కలిసి పుణెకు వెళ్లారు. అక్కడ తల్లిదండ్రులు కూలి పనికి వెళ్తే బాలుడు ఇంట్లోనే ఒంటరిగా ఉండేవాడు. ఈ క్రమంలోనే గురువారం కూడా దంపతులు పనికి వెళ్లగా కరణ్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటి పక్కనే ఉండే ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన పుంటి, మరొక వ్యక్తి కలిసి ఈ బాలుడికి మాయమాటలు చెప్పి బైక్‌పై ఓ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మరో ఇద్దరితో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాలుడి చేతిని విరగ్గొట్టడంతో పాటు కణతి, ముఖంపై తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


అనంతరం నిందితులు బాలుడి మృతదేహాన్ని గోనె సంచిలో తీసుకొచ్చి చెత్తకుండీలో వేస్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కుమారుడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించగా వారు తమకు లభ్యమైన బాలుడి మృతదేహాన్ని చూపించగా తమ కుమారుడేనని గుర్తించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. 


పూణె నుంచి శనివారం ఉదయం స్వగ్రామమైన పీర్లబండ తండాకు బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. తమ సొంత పొలంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పరిగి ఎమ్మెల్యే మహేశ్‌ రెడ్డి శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని, బాధిత కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇవ్వడంతో పాటు అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ఫోన్‌లో మహారాష్ట్ర డీజీపీతో మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.