Madhya Pradesh:
మధ్యప్రదేశ్‌లోనే మరో దారుణం..
మధ్యప్రదేశ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు గిరిజన యువకులపై విచక్షణారహితంగా దాడి చేసిన వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు బాధితుల్లో ఒకరు మైనర్ కావడం వల్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. దాదాపు 8 గంటల పాటు వాళ్లకు నరకం చూపించి చివరకు రోడ్డుపైన పడేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...18 ఏళ్ల యువకుడితో పాటు మరో 15 ఏళ్ల బాలుడినీ ఇలా చిత్రహింసలకు గురి చేశారు. వీళ్లిద్దరూ బైక్‌పై వెళ్తుండా స్కిడ్ అయ్యి కింద పడిపోయారు. ఈ విషయంలోనే ముగ్గురు యువకులకు, ఈ బాధితులకు వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన యువకులు ఈ ఇద్దరిని లాక్కుని సెక్యూరిటీ గార్డ్ రూమ్‌లో పడేశారు. 8 గంటల పాటు తీవ్రంగా కొట్టారు. తెల్లారిన తరవాత వాళ్లను వదిలేశారు. కుటుంబ సభ్యులు వాళ్లను ఆసుపత్రికి తరలించగా..వారికి చికిత్స కొనసాగుతోంది. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌సీ, ఎస్‌టీ యాక్ట్ కింద వాళ్లపై కేసు నమోదు చేశారు. అయితే...ఈ కేసులో ఇంకొందరి జోక్యం కూడా ఉందని, త్వరలోనే వాళ్లనూ పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మధ్యే ఓ గిరిజనుడిపై యూరినేట్ చేసిన ఘటన సంచలనమైంది. ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆ వీడియో కూడా వైరల్ అయ్యి సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్ రాజకీయాల్నీ ఒక్కసారిగా వేడెక్కించింది.
యువకుడిని తన కాళ్లు నొక్కాలని ఓ వ్యక్తి చితకబాదాడు. ఇది కూడా మధ్యప్రదేశ్‌లోనే జరిగింది. అంతటితో ఆగకుండా తన కాళ్లు నాకాలంటూ చిత్రహింసలు చేసి చివరికి యువకుడితో కాళ్లు నాకించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై వెళ్తున్న ఓ యువకుడిని కొంత మంది యువకులు కారులో వెళ్లి కిడ్నాప్ చేశారు. కారులో ఎక్కించుకున్న యువకుడిని చిత్రహింసలు పెట్టారు. బలవంతంగా కారులోకి ఎక్కించుకుని కదులుతున్న కారులోనే అతనిపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ యువకుడి ముఖంపై చెప్పులతో కొట్టారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ, పిడిగుద్దులతో యువకుడిని చిత్రహింసలు పెట్టారు. ఆపై ఆ యువకుడితో తమ కాళ్లు నాకించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలను ఆ కారులోనే ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.