మత్తు పదార్థాలు విక్రయించి యువతను పెడదారి పెట్టాలని చూస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్. పుత్తూరు డివిజన్‌లోని పుత్తూరు చర్చి కాంపౌండ్‌లో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులు పట్టుకొని విచారించారు. వాళ్లు చెప్పే విషయాలు వినిషాక్ తిన్నారు.
అనంతపురం జిల్లా పాత టౌన్‌కు చెందిన జనగుండ మోహన్ కృష్ణ, గంజి అజయ్ కుమార్, తమిళనాడుకు చెందిన ప్రశాంత్, లోకేష్‌ను పట్టుకొని పోలీసులు విచారించారు. అనంతపురానికి చెందిన మోహన్ కృష్ణ చెన్నైకి చెందిన అజయ్ కుమార్, ప్రశాంత్ తో కలిసి ద్రవరూపంలో గంజాయిని విక్రయిస్తున్నట్టు విచారణలో చెప్పారు. విశాఖపట్నం నుంచి చెన్నై ఆ తర్వాత అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు అంగీకరించారు.
లిక్విడ్ గంజాయిని పుత్తూరులో విక్రయించేందుకు తీసుకొచ్చి ఇలా పోలీసులకు చిక్కారు. వారి వద్ద నుంచి ఒక కేజీ 435 గ్రాముల లిక్విడ్ గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
లిక్విడ్ గంజాయి ముఠాలో సస్పెండ్ ఖాకీ
అనంతపురం జిల్లాలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న జనగుండ మోహన్ కృష్ణ ఈ ముఠాలో కింగ్‌పిన్. గతంలో కూడా ఈ వ్యక్తి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయినా బుద్ది మారలేదు.
నలుగుర్ని పోగేసి గంజాయి వ్యాపారాన్ని కొనసాగించాడు. గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెరిగిపోవడంతో లిక్విడ్ రూపంలోకి మార్చి బోర్డర్ దాటిస్తున్నారు. లిక్విడ్ రూపంలో అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుందని సులభంగా తరించవచ్చని వీళ్ల ఉద్దేశం.
ఇలాంటి ముఠా ఉంటాయనే నిత్యం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేసినట్టు అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ తెలిపారు. దీన్ని మరింత పెంచుతున్నట్టు పేర్కొన్నారు. అనుమానితులపై, వాహనదారులపై ప్రత్యేక నిఘా పెడుతున్నట్టు వెల్లడించారు.
గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై రౌడీ షీట్
యువతను మత్తుపదార్థాలకు బానిసలుగా చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తే కఠినంగా ఉంటామన్నారు అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్. అక్రమ రవాణాకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు. గంజాయి లిక్విడ్ వంటివే కాకుండా ఇటీవల సింథటిక్ డ్రగ్స్ కూడా మార్కెట్లోకి వచ్చిందన్నారు. ఇలాంటి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచమని అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
తిరుపతి కొత్త జిల్లా ఏర్పడటంతో నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలాంటి ప్రాంతాలు తిరుపతి జిల్లాలో చేరడం వల్ల పోలీసులపై అదనపు బాధ్యతలు ఉన్నాయన్నారు అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్. వీటికి అనుగుణంగా ఆ ప్రాంతాలలో ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు.